విషాదం.. 10 మంది జవాన్ల మరణం!

విషాదం.. 10 మంది జవాన్ల మరణం!

జమ్మూకశ్మీర్‌లోని దోడా జిల్లాలో గురువారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. దేశ సరిహద్దుల్లో కాపలా కాస్తున్న భారత సైన్యానికి చెందిన వాహనం అదుపుతప్పి లోయలో పడిపోయింది.

విశ్వంభర, నేషనల్ బ్యూరో: జమ్మూకశ్మీర్‌లోని దోడా జిల్లాలో గురువారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. దేశ సరిహద్దుల్లో కాపలా కాస్తున్న భారత సైన్యానికి చెందిన వాహనం అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ హృదయవిదారక ఘటనలో 10 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోగా, మరో 11 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. దేశ రక్షణ కోసం నిరంతరం శ్రమించే వీరజవాన్ల మృతితో దేశవ్యాప్తంగా విషాద ఛాయలు అలముకున్నాయి. భదేర్వా-చంబా రహదారిలోని 'ఖన్నీ' పర్వత ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రాంతం సముద్ర మట్టానికి సుమారు 9 వేల అడుగుల ఎత్తులో ఉంటుంది. సైనికులతో వెళ్తున్న బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఒక శిఖరం పైభాగానికి చేరుకున్న సమయంలో మలుపు వద్ద డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో వాహనం ఒక్కసారిగా 200 అడుగుల లోతైన లోయలోకి దూసుకెళ్లింది. సమాచారం అందిన వెంటనే సైన్యం, స్థానిక పోలీసులు కలిసి సంయుక్తంగా సహాయక చర్యలు చేపట్టారు. లోయలో పడిన వాహనం నుంచి జవాన్లను వెలికితీయడం క్లిష్టతరంగా మారింది.

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ..
ప్రమాద స్థలంలోనే నలుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోగా, మిగిలిన వారిని అత్యవసరంగా హెలికాప్టర్ల ద్వారా ఉధంపుర్ మిలిటరీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరో ఆరుగురు జవాన్లు మరణించినట్లు అధికారులు ధృవీకరించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న 11 మందిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Read More అసలు యుద్ధం ఇప్పుడే ప్రారంభమైంది: ఉద్ధవ్ థాకరే

ప్రముఖుల నివాళులు
ఈ ఘోర ప్రమాదంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జమ్మూకశ్మీర్‌లో మన సైనికులను కోల్పోవడం అత్యంత బాధాకరమని అమిత్ షా పేర్కొన్నారు. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని అన్నారు. జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా జవాన్ల మృతికి సంతాపం ప్రకటించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల త్యాగం వెలకట్టలేనిదని వారు పేర్కొన్నారు.