బీజేపీ నూతన సారథిగా నితిన్ నబీన్
జాతీయ అధ్యక్షుడిగా ఏకగ్రీవ ఎన్నిక
భారతీయ జనతా పార్టీ (BJP) జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన, ఇకపై పూర్తిస్థాయి జాతీయ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టనున్నారు.
విశ్వంభర, నేషనల్ న్యూస్: భారతీయ జనతా పార్టీ (BJP) జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన, ఇకపై పూర్తిస్థాయి జాతీయ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టనున్నారు. సోమవారం ఉదయం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. నితిన్ నబీన్ పేరును ప్రతిపాదిస్తూ పార్టీ నేతలు మొత్తం 37 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. గడువు ముగిసే సమయానికి ఆయనకు పోటీగా మరెవ్వరూ నామినేషన్లు వేయకపోవడంతో నితిన్ ఎన్నిక ఏకగ్రీవమైనట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ముఖ్యనేతల సమక్షంలో నామినేషన్
ఈ నామినేషన్ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీలతో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీ అగ్రనేతలు పాల్గొన్నారు. పార్టీలో అందరి ఆమోదంతోనే ఆయనను ఈ కీలక పదవికి ఎంపిక చేసినట్లు స్పష్టమవుతోంది. నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన నితిన్ నబీన్.. మంగళవారం (జనవరి 20) ఉదయం 11 గంటలకు అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు.ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమక్షంలో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈ వేడుకకు హాజరుకానున్నారు.



