విమాన ప్రమాదంలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం!

విమాన ప్రమాదంలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం!

 మహారాష్ట్ర రాజకీయ సీనియర్ నేత, ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ (66) ఇకలేరు. బుధవారం ఉదయం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. 

విశ్వంభర, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర రాజకీయ సీనియర్ నేత, ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ (66) ఇకలేరు. బుధవారం ఉదయం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. సాంకేతిక లోపం, ప్రతికూల వాతావరణం తోడవడంతో అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం పుణె సమీపంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్‌తో పాటు మరో నలుగురు సిబ్బంది అక్కడికక్కడే మృతి చెందారు. బారామతిలో ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా జరిగిన ఈ ప్రమాదం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.

ప్రమాదం జరిగిన సమయమిదే
వచ్చే నెలలో జరగనున్న జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారం కోసం అజిత్ పవార్ బుధవారం ఉదయం ముంబయి నుంచి ప్రైవేట్ చార్టర్డ్ విమానంలో తన సొంత నియోజకవర్గమైన బారామతికి బయలుదేరారు. ఉదయం 8:10 గంటలకు ముంబై విమానాశ్రయం నుంచి విమానం టేకాఫ్ అయ్యింది. 8:25 గంటలకు మార్గమధ్యంలో ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తినట్లు పైలట్ గుర్తించారు. 8:30 గంటలకు విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేసేందుకు పైలట్ మొదటి ప్రయత్నం చేశారు, కానీ విఫలమయ్యారు. పరిస్థితి విషమించడంతో రెండోసారి ల్యాండింగ్‌కు ప్రయత్నించగా, విమానం నియంత్రణ కోల్పోయి రన్‌వేకు సమీపంలోని కొండ ప్రాంతంలోకి దూసుకెళ్లింది. కొండ ప్రాంతంలో ప్రయాణిస్తున్న సమయంలో విమానం అదుపు తప్పి ఒక భారీ బండరాయిని బలంగా ఢీకొట్టింది. దీంతో విమానం రెండు ముక్కలుగా విరిగిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే మంటలు ఎగిసిపడటంతో విమానం తోక భాగం మినహా అంతా కాలిబూడిదయింది.

Read More అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ మెస్సీతో మ్యాచ్ కోసం సిద్ధమవుతున్న సీఎం రేవంత్

విజిబిలిటీ తక్కువగా ఉండటమే శాపమా?
ఈ దుర్ఘటనలో విమానంలో ఉన్న ఐదుగురూ అక్కడికక్కడే మృతి చెందారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, ముంబై పీఎస్‌వో వదీప్ జాదవ్, పైలట్ కెప్టెన్ సుమిత్ కపూర్, కో-పైలట్ కెప్టెన్ శాంభవి పాఠక్, ఫ్లైట్ అటెండెంట్ పింకీ మాలి ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయంలో పుణె, బారామతి పరిసర ప్రాంతాలను దట్టమైన పొగమంచు కమ్మేసింది. విజిబిలిటీ (కనిపించే దూరం) చాలా తక్కువగా ఉండటంతో పైలట్ రన్‌వేను సరిగ్గా అంచనా వేయలేకపోయారు. దీంతో విజిబిలిటీ తక్కువగా ఉండడంతో ప్రమాదం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

కుట్ర కోణంపై అనుమానాలు?
సాంకేతిక లోపమే ప్రాథమిక కారణమని అధికారులు చెబుతున్నప్పటికీ, ఈ ప్రమాదంపై రాజకీయ వర్గాల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అజిత్ పవార్ మళ్లీ శరద్ పవార్‌తో కలిసి 'మహా వికాస్ అఘాడీ' కూటమిలోకి వస్తారంటూ సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో వేడి పుట్టించాయి. పవార్ కుటుంబాల కలయికపై చర్చ జరుగుతున్న తరుణంలోనే ఈ ప్రమాదం జరగడం వెనుక ఏదైనా కుట్ర ఉందా అని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. 

ప్రమాదానికి గురైన విమానం ప్రత్యేకతలు
అజిత్ పవార్ ప్రయాణించిన విమానం వీఎస్ఆర్ వెంచర్స్ యాజమాన్యంలోని లియర్ జెట్ 45XR. ఈ విమానాన్ని బాంబార్డియర్ ఏరో స్పేస్ తయారీ చేసింది. దీనిలో ఎనిమిది మంది ప్రయాణించే వీలుంది. 51,000 అడుగుల ఎత్తు వరకు ఎగిరే సామర్థ్యం ఉంటుంది. ఫ్లైట్ ట్రాకర్ 'Flightradar24' ప్రకారం.. విమానం రెండోసారి ల్యాండింగ్ కోసం ప్రయత్నిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మహారాష్ట్ర రాజకీయాల్లో తిరుగులేని నేతగా ఎదిగిన అజిత్ పవార్ మరణం ఆ రాష్ట్ర రాజకీయాల్లో ఒక తీరని లోటుగా మిగిలిపోయింది.

భారీ పేలుళ్లు: ప్రత్యక్ష సాక్షి
విమానం కిందకు దిగుతుంటే అది ప్రమాదానికి గురవుతుందనిపించినట్లు ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపినట్లు జాతీయ మీడియా పేర్కొంది. విమానం నేలను తాకిన తర్వాత పలు మార్లు పేలుడు శబ్ధాలు వినిపించాయని ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు వచ్చినా భారీ అగ్ని కీలల కారణంగా ఎవరినీ కాపాడలేకపోయినట్లు చెప్పారు.