సిలికాన్ సిటీ కాదు.. ట్రాఫిక్ సిటీ!

సిలికాన్ సిటీ కాదు.. ట్రాఫిక్ సిటీ!

ట్రాఫిక్ కష్టాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన కర్ణాటక రాజధాని బెంగళూరు, ప్రపంచంలోనే అత్యంత రద్దీ నగరాల జాబితాలో రెండో స్థానానికి చేరింది.

విశ్వంభర, నేషనల్ బ్యూరో: ట్రాఫిక్ కష్టాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన కర్ణాటక రాజధాని బెంగళూరు, ప్రపంచంలోనే అత్యంత రద్దీ నగరాల జాబితాలో రెండో స్థానానికి చేరింది. నెదర్లాండ్స్‌కు చెందిన లొకేషన్ టెక్నాలజీ సంస్థ 'టామ్‌టామ్' విడుదల చేసిన 2025 ట్రాఫిక్ సూచీలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. మెక్సికో సిటీ ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలవగా.. భారత ఐటీ హబ్ అయిన బెంగళూరు రెండో స్థానంలో నిలిచి వాహనదారుల అవస్థలను కళ్లకు కట్టింది.

టామ్‌టామ్ విడుదల చేసిన ట్రాఫిక్ సూచీ-2025 ప్రకారం.. బెంగళూరు నగరంలో కేవలం 10 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి సగటున 36 నిమిషాల 9 సెకన్ల సమయం పడుతోంది. 2024తో పోలిస్తే ఈ సమయం మరో 2 నిమిషాలు పెరగడం గమనార్హం. రద్దీ వేళల్లో నగరంలో వాహనాల సగటు వేగం గంటకు కేవలం 13.9 కిలోమీటర్లకు పడిపోయింది. అంటే వాహనం కంటే వేగంగా మనిషి నడవగలడనే విమర్శలు వినిపిస్తున్నాయి.  2025, మే 17న బెంగళూరులో ట్రాఫిక్ రికార్డు స్థాయికి చేరింది. ఆ రోజు సాయంత్రం 6 గంటల సమయంలో 15 నిమిషాల ప్రయాణంలో వాహనదారులు కేవలం 2.5 కిలోమీటర్లు మాత్రమే కదలగలిగారు. సగటున ఒక బెంగళూరు వాసి ఏడాదికి 168 గంటల సమయాన్ని (అంటే సుమారు ఏడు రోజుల పాటు) కేవలం ట్రాఫిక్ జామ్‌లలోనే కోల్పోతున్నట్లు నివేదిక స్పష్టం చేసింది. 

Read More హిందీపై మారన్ సంచలన వ్యాఖ్యలు.. బానిసత్వానికి దారి..!!

భారత్ లోని ఇతర నగరాల పరిస్థితి
ప్రపంచంలోని టాప్-5 రద్దీ నగరాల్లో బెంగళూరుతో పాటు మహారాష్ట్రలోని పుణె (5వ స్థానం) కూడా చోటు దక్కించుకుంది. ముంబయి (18వ స్థానం), దిల్లీ (23వ స్థానం), కోల్‌కతా (29వ స్థానం),  జైపుర్‌ (30వ స్థానం)చెన్నై (32వ స్థానం). హైదరాబాద్ (47వ స్థానం)ల్లో నిలిచాయి. ప్రపంచవ్యాప్తంగా 500 నగరాల్లో సేకరించిన 3.65 ట్రిలియన్ కిలోమీటర్ల డేటా ఆధారంగా ఈ ర్యాంకులను కేటాయించారు. పెరుగుతున్న వాహనాల సంఖ్య, రోడ్ల విస్తరణ లేకపోవడం, మౌలిక సదుపాయాల పనుల జాప్యం కారణంగానే భారత్‌లోని మెట్రో నగరాలు ఈ జాబితాలో ముందు వరుసలో నిలుస్తున్నాయి.