బారామతి 'బాహుబలి'.. అజిత్ పవార్ రాజకీయ ప్రస్థానం
"ఫైల్ ఎక్కడా ఆగకూడదు.. పని జరగాల్సిందే" అని అధికారులను పరుగులు పెట్టించే మొండితనం, పరిపాలనలో పట్టు, సమయపాలనలో కచ్చితత్వం.. ఇవి అజిత్ పవార్‌ను మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక ప్రత్యేకమైన నాయకుడిగా నిలబెట్టాయి.
విశ్వంభర, నేషనల్ బ్యూరో: "ఫైల్ ఎక్కడా ఆగకూడదు.. పని జరగాల్సిందే" అని అధికారులను పరుగులు పెట్టించే మొండితనం, పరిపాలనలో పట్టు, సమయపాలనలో కచ్చితత్వం.. ఇవి అజిత్ పవార్‌ను మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక ప్రత్యేకమైన నాయకుడిగా నిలబెట్టాయి. బారామతి గడ్డ నుంచి మొదలైన ఆయన ప్రస్థానం.. ఆరుసార్లు ఉప ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించే వరకు అప్రతిహతంగా సాగింది.
రాజకీయ అరంగేట్రం.. బాబాయ్ నీడలో
1959 జూలై 22న మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా డియోలాలి ప్రవరలో అజిత్ అనంతరావు పవార్ జన్మించారు. శివాజీ విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ పూర్తి చేశారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చారు. తన బాబాయ్ శరద్ పవార్ స్ఫూర్తితో 1982లో సహకార చక్కెర కర్మాగార బోర్డు సభ్యుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1991లో పూణే జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఛైర్మన్‌గా విజయం సాధించారు. 1991లోనే బారామతి పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి మొదటిసారి లోక్‌సభకు అజిత పవార్ ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆ స్థానాన్ని శరద్ పవార్ కోసం వదులకొని రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చారు. అదే ఏడాది ఉప ఎన్నికల్లో బారామతి అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందారు. ఈ నియోజకవర్గం నుంచి వరుసగా ఏడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి బారామతిని తన కంచుకోటగా మార్చుకున్నారు.
రికార్డు స్థాయిలో డిప్యూటీ సీఎం
మహారాష్ట్ర చరిత్రలో ఆరు పర్యాయాలు ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన ఏకైక నాయకుడు అజిత్ పవార్. భావజాలం ఏదైనా, ప్రభుత్వం ఎవరిదైనా ఆయన ఉంటేనే పాలన సాధ్యమనే స్థాయికి ఎదిగారు. పృథ్వీరాజ్ చవాన్, ఉద్ధవ్ థాకరే, ఏక్‌నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్ వంటి భిన్న ముఖ్యమంత్రుల వద్ద డిప్యూటీ సీఎంగా పనిచేసి తన పరిపాలనా దక్షతను నిరూపించుకున్నారు. నీటిపారుదల, ఆర్థిక, విద్యుత్, ప్రణాళిక వంటి కీలక శాఖలను సమర్థవంతంగా నిర్వహించి రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. 1991-1992 మధ్య వ్యవసాయ, విద్యుత్ శాఖ మంత్రిగా అజిత్ పవార్ పనిచేశారు. 1992లో శరద్ పవార్ సీఎంగా ఉండగా, విద్యుత్, ప్రణాళిక శాఖ సహాయ మంత్రి అయ్యారు. 1999లో, కాంగ్రెస్-ఎన్సీపీ సంకీర్ణ ప్రభుత్వంలో నీటిపారుదల శాఖకు మంత్రిగా వ్యవహరించారు. 2003లో సుశీల్ కుమార్ షిండే మంత్రివర్గంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా చేశారు. ఆ తర్వాత విలాశ్ రావు దేశ్ ముఖ్, అశోక్ చవాన్ ప్రభుత్వాలలో జల వనరుల శాఖ మంత్రిగా పని చేశారు.
సంచలన మలుపులు
అజిత్ పవార్ రాజకీయ జీవితం ఎప్పుడూ ఒక ప్రవాహంలా సాగలేదు. అందులో ఎన్నో ఒడిదుడుకులు, సంచలనాలు ఉన్నాయి. 2019లోమహారాష్ట్రలో హంగ్ ఫలితాలు రావడంతో ఎన్సీపీ నుంచి అజిత్ పవార్ విడిపోయి బీజేపీతో కలిసి ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఎవరూ ఊహించని విధంగా దేవేంద్ర ఫడ్నవీస్‌తో కలిసి తెల్లవారుజామున డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. ఆ ప్రభుత్వం 80 గంటలకే కూలిపోయినా, ఆయనకున్న 'పవర్' ఏంటో అందరికీ తెలిసింది. 2023లో బాబాయ్ శరద్ పవార్‌తో విభేదించి, ఎన్సీపీని తన పక్షాన తిప్పుకుని అధికారిక చిహ్నాన్ని (గడియారం) దక్కించుకోవడం ఆయన రాజకీయ చతురతకు పరాకాష్ట. 2024 ఎన్నికల్లో మహాయుతి కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక అజిత్ పవార్ మరోసారి డిప్యూటీ సీఏం పదవి చేపట్టారు. ఇదిలా ఉండగా తాజా మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో అజిత్ పవార్ ఎన్సీపీ- శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీఎస్పీ కలిసి పోటీ చేశాయి. కానీ అనుకున్న స్థాయిలో ప్రభావం చూపలేకపోయాయి.
వచ్చే నెలలో జరగబోయే జిల్లా పరిషత్ ఎన్నికల కోసం శక్తివంచన లేకుండా పనిచేస్తున్న తరుణంలో, తన సొంత నియోజకవర్గం బారామతిలోనే ఆయన ప్రాణాలు కోల్పోయారు. అజిత్ పవార్ అంటే కేవలం ఒక నాయకుడు కాదు, అది ఒక పని చేసే యంత్రమని తెలిపారు. మహారాష్ట్ర పరిపాలనలో ఆయన లేని లోటు పూడ్చలేనిదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.



