మహారాష్ట్ర ఎన్నికల్లో సంచలనం: గౌరీ లంకేశ్ హత్య కేసు నిందితుడి విజయం
విశ్వంభర, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల ఫలితాలు అనూహ్య పరిణామాలకు తెరతీశాయి. జాల్నా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గౌరీ లంకేశ్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న శ్రీకాంత్ పాంగార్కర్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది.
విశ్వంభర, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల ఫలితాలు అనూహ్య పరిణామాలకు తెరతీశాయి. జాల్నా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గౌరీ లంకేశ్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న శ్రీకాంత్ పాంగార్కర్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది.
ప్రముఖ జర్నలిస్టు గౌరీ లంకేశ్‌ను 2017లో బెంగళూరులోని ఆమె నివాసంలో గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి హత్య చేశారు. ఈ సంచలన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఆ కేసులో భాగంగా శ్రీకాంత్ పాంగార్కర్‌ను పోలీసులు అరెస్టు చేయగా, ఆయన 2024లో బెయిల్‌పై విడుదలయ్యారు. కేసు ఇంకా విచారణ దశలోనే ఉన్నప్పటికీ, ఆయన ఎన్నికల్లో గెలవడం ఆసక్తికరంగా మారింది.
జాల్నా నగరంలోని 13వ వార్డు నుంచి శ్రీకాంత్ పాంగార్కర్ పోటీ చేశారు. ఈ వార్డులో ఏక్‌నాథ్ షిండే నాయకత్వంలోని శివసేన (షిండే) పార్టీ తమ అభ్యర్థిని నిలబెట్టలేదు. అయితే బీజేపీతో పాటు ఇతర ప్రధాన రాజకీయ పార్టీలు మాత్రం తమ అభ్యర్థులను బరిలోకి దింపాయి. ఈ పరిస్థితుల్లో స్వతంత్ర అభ్యర్థిగా నిలిచిన శ్రీకాంత్ విజయం సాధించడం విశేషంగా మారింది.
గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు శ్రీకాంత్ పాంగార్కర్ శివసేన (షిండే) పార్టీలో చేరేందుకు ప్రయత్నించారు. అయితే ఆయనపై ఉన్న వివాదాల నేపథ్యంలో పార్టీ లోపల అభ్యంతరాలు వ్యక్తమవడంతో, ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ఆయనకు పార్టీలో అవకాశం కల్పించలేదు.
శ్రీకాంత్‌కు జాల్నా మున్సిపల్ రాజకీయాల్లో గత అనుభవం కూడా ఉంది. 2001 నుంచి 2006 వరకు ఆయన జాల్నా మున్సిపల్ కౌన్సిల్ సభ్యుడిగా పనిచేశారు. అయితే 2011లో శివసేన టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన ఆ పార్టీకి దూరమయ్యారు. ఆ తరువాత హిందూ జనజాగృతి సమితిలో చేరి కార్యకలాపాలు కొనసాగించారు.ఇప్పుడు మళ్లీ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా శ్రీకాంత్ పాంగార్కర్ పేరు మరోసారి రాజకీయంగా, న్యాయపరంగా దేశవ్యాప్తంగా చర్చకు కేంద్రంగా మారింది. 



