సంక్రాంతి సందడి: రయ్.. రయ్.. పట్నం నుంచి పల్లెకు..
విజయవాడ హైవేపై ఒక్కసారిగా పెరిగిన వాహనాల రద్దీ
తెలుగువారి అతిపెద్ద పండుగ 'సంక్రాంతి' సంబరాలు అప్పుడే మొదలయ్యాయి. ఉద్యోగ, వ్యాపార రీత్యా హైదరాబాద్‌లో స్థిరపడిన కోస్తాంధ్ర, రాయలసీమ వాసులు తమ స్వగ్రామాలకు బయలుదేరడంతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై రద్దీ ఒక్కసారిగా పెరిగింది.
విశ్వంభర, బ్యూరో: తెలుగువారి అతిపెద్ద పండుగ 'సంక్రాంతి' సంబరాలు అప్పుడే మొదలయ్యాయి. ఉద్యోగ, వ్యాపార రీత్యా హైదరాబాద్‌లో స్థిరపడిన కోస్తాంధ్ర, రాయలసీమ వాసులు తమ స్వగ్రామాలకు బయలుదేరడంతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై రద్దీ ఒక్కసారిగా పెరిగింది. శుక్రవారం సాయంత్రం నుంచే మొదలైన ఈ వాహనాల తాకిడి ఆదివారం ఉదయానికి మరింత తీవ్రరూపం దాల్చింది. ప్రధానంగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్‌గేట్ వద్ద పరిస్థితి అత్యంత రద్దీగా ఉంది. టోల్‌గేట్ దాటడానికి కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరుతున్నాయి.
రద్దీని దృష్టిలో ఉంచుకుని టోల్ యాజమాన్యం అన్ని కౌంటర్లను (10+ కౌంటర్లు) కేవలం విజయవాడ వైపు వెళ్లే వాహనాల కోసమే కేటాయించినప్పటికీ, రద్దీ తగ్గడం లేదు. కొన్ని వాహనాలకు ఫాస్టాగ్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల టోల్ ప్లాజా వద్ద ఆలస్యం జరుగుతోంది. మరోవైపు కొర్రెముల, బీబీనగర్, నార్కెట్‌పల్లి జంక్షన్ల వద్ద కూడా ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతోంది. ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేటు వాహనాలు, కార్లు వేల సంఖ్యలో రోడ్డెక్కడంతో హైవే అంతా వాహనమయంగా మారింది. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడానికి రాచకొండ, నల్గొండ పోలీసులు ప్రత్యేక బలగాలతో మోహరించారు. రైళ్లు, బస్సుల్లో టికెట్లు దొరకని వారు ప్రైవేటు ట్రావెల్స్‌ను ఆశ్రయిస్తుండగా, డిమాండ్‌ను బట్టి నిర్వాహకులు రెట్టింపు ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు ప్రయాణికులు వాపోతున్నారు. మరోవైపు ప్రయాణికులు వాహనాలను అతివేగంతో నడపవద్దని, సీట్ బెల్ట్ ధరించాలని, హైవేపై నిలిపిన వాహనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హైవే పెట్రోలింగ్ పోలీసులు సూచిస్తున్నారు.



