కేసీఆర్ త్యాగాల పునాదులపైనే నీ సీఎం కుర్చీ

కేసీఆర్ త్యాగాల పునాదులపైనే నీ సీఎం కుర్చీ

మిర్యాలగూడ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఘాటుగా సమాధానమిచ్చారు.

విశ్వంభర, తెలంగాణ బ్యూరో: మిర్యాలగూడ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఘాటుగా సమాధానమిచ్చారు. బుధవారం మెదక్‌లో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ.. రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానంపై విమర్శలు గుప్పించారు. 'జాతిపిత' అనే పదానికి అర్థం తెలియకుండానే ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ కోసం పదవులను గడ్డిపోచల్లా త్యాగం చేసిన ఘనత కేసీఆర్‌కు మాత్రమే దక్కుతుందని హరీశ్ రావు కొనియాడారు. ప్రాణాలకు తెగించి స్వరాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ వీరుడిని విమర్శించే అర్హత రేవంత్‌కు లేదని స్పష్టం చేశారు.
 
తెలంగాణ పోరాట సమయంలో ఉద్యమకారులపై తుపాకీ గురిపెట్టిన చరిత్ర రేవంత్ రెడ్డిది కాదా అని హరీశ్ రావు ప్రశ్నించారు. పార్టీ కండువాలు మారుస్తూ, కాంగ్రెస్ సీనియర్ నేతలను తొక్కుకుంటూ పదవులు సాధించిన వ్యక్తి రేవంత్ అని విమర్శించారు. కేసీఆర్ తెలంగాణను సాధించకపోయి ఉంటే రేవంత్‌కు ముఖ్యమంత్రి పదవి వచ్చేదా అని నిలదీశారు.
 
పదవుల కోసం పాకులాట
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ ఆకాంక్షల కంటే పదవులే ముఖ్యమని హరీశ్ రావు ఆరోపించారు. కేసీఆర్ గురించి మాట్లాడే ముందు తన గతాన్ని ఒకసారి చూసుకోవాలని హితవు పలికారు. రేవంత్ రెడ్డి గతంలో ఏనాడూ తెలంగాణ కోసం కొట్లాడిన దాఖలాలు లేవని దుయ్యబట్టారు. స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఉద్యమ నాయకుడిని కించపరచడం సరికాదని హరీశ్ రావు హితవు పలికారు.