టీజీ ఈసెట్‌ షెడ్యూల్‌ విడుదల

టీజీ ఈసెట్‌ షెడ్యూల్‌ విడుదల

ఇంజినీరింగ్‌, ఫార్మసీ కళాశాలల్లో నేరుగా రెండో సంవత్సరంలో ప్రవేశం పొందేందుకు నిర్వహించే టీజీ ఈసెట్‌ -2026 క్యాలెండర్‌ను ఉన్నత విద్యామండలి బుధవారం ప్రకటించింది.

విశ్వంభర, తెలంగాణ బ్యూరో: ఇంజినీరింగ్‌, ఫార్మసీ కళాశాలల్లో నేరుగా రెండో సంవత్సరంలో ప్రవేశం పొందేందుకు నిర్వహించే టీజీ ఈసెట్‌ -2026 క్యాలెండర్‌ను ఉన్నత విద్యామండలి బుధవారం ప్రకటించింది. ఈసారి కూడా పరీక్ష నిర్వహణ బాధ్యతలను ఉస్మానియా యూనివర్సిటీకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. డిప్లొమా, బీఎస్సీ (గణితం) పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ప్రవేశ పరీక్షను కంప్యూటర్ ఆధారిత పద్ధతిలో మొత్తం 200 మార్కులకు నిర్వహిస్తారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.500, ఇతర అభ్యర్థులు రూ.900 గా నిర్ణయించారు.
 
విద్యార్థులు తమ దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారా మాత్రమే సమర్పించాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 9 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మొదలవుతుంది. ఏప్రిల్ 18 వరకు గడువు ఉంటుంది. మే 15న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. నిర్ణీత గడువు ముగిసినా, ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసుకునే వీలుంటుందని అధికారులు స్పష్టం చేశారు. అభ్యర్థులు సందేహాల నివృత్తి కోసం ecet.tgche.ac.in వెబ్‌సైట్‌ను చూడాలని సూచించారు.