సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలి
- డిసిహెచ్ఎస్ చిన్న నాయక్
విశ్వంభర, రామన్నపేట: ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాల సంఖ్యను పెంచడం ద్వారా ప్రసూతి సేవలను మెరుగుపరచాలని డిసిహెచ్ఎస్ చిన్న నాయక్ అన్నారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కేంద్రంలోని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన అకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యుల, వైద్య సిబ్బంది హాజరు రిజిస్టర్ లను పరిశీలించారు. అనంతరం వార్డులలో తిరిగి వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. గర్భిణీ లతో మాట్లాడారు, ప్రభుత్వ ఆసుపత్రిలో గైనకాలజిస్టు వైద్యులు, అవసరమైన అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయని, మెరుగైన వసతులు, సౌకర్యాలు ఉన్నాయని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. అనంతరం వైద్యులు, నర్సింగ్ సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు అందుబాటులో ఉంటూ రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలని ఆదేశించారు. నెలవారీగా ఎక్కువ ప్రసవాలు జరిగేలా చూడాలని, ఆశ కార్యకర్తలతో గర్భిణులను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. సాధారణ ప్రసవాలను ప్రోత్సహించి, ఆపరేషన్లు తగ్గించి, సాధారణ ప్రసవాల సంఖ్యను పెంచేందుకు వైద్యులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. నెలలు నిండిన గర్భిణులను గుర్తించి, ప్రభుత్వ ఆసుపత్రులలోనే ప్రసవం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు నమ్మకం కలిగేలా, సురక్షిత ప్రసవాల గురించి అవగాహన పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు బి.వీరన్న, రజిని, స్వాతి బాయి, మాధవచారి, నవీన్ సింగ్, పి.వీణ, సుమంగళి, హెడ్ నర్సులు సువర్ణ, సోలి, జ్యోతి, నర్సింగ్ సిబ్బంది, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.



