పాతబస్తీ మెట్రోపై హైకోర్టు కీలక ఆదేశం
On
పాతబస్తీలో మెట్రో నిర్మాణ పనుల వల్ల చారిత్రక కట్టడాలు దెబ్బతింటున్నాయంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ చేపట్టింది.
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: పాతబస్తీలో మెట్రో నిర్మాణ పనుల వల్ల చారిత్రక కట్టడాలు దెబ్బతింటున్నాయంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో జరిగిన ఒప్పందాల వివరాలను కోర్టు ముందు ఉంచాలని మెట్రో నిర్మాణ సంస్థను ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ఆదేశించింది. వారసత్వ కట్టడాల సంరక్షణ కమిటీ ఏర్పాటుకు సంబంధించిన స్పష్టమైన సమాచారంతో అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు స్పష్టం చేసింది. మెట్రో సంస్థ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ ఇమ్రాన్ ఖాన్ కోర్టుకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పనుల పురోగతిని వివరించారు. ఈ నిర్మాణ ప్రక్రియలో కేవలం 3 పురాతన కట్టడాలను మాత్రమే కూల్చివేయాల్సి ఉంటుందని ఆయన వెల్లడించారు.
కోర్టులో జరిగిన వాదనలు
ప్రస్తుతం ఆస్తుల స్వాధీన ప్రక్రియ కొనసాగుతోందని ఏఏజీ వాదనలు వినిపించారు. చట్ట నిబంధనల ప్రకారమే ఆస్తుల సేకరణ పూర్తి చేస్తామన్నారు. కట్టడాల తొలగింపునకు సంబంధిత శాఖల అనుమతి కోసం దరఖాస్తు చేశామని తెలిపారు. వారసత్వ కట్టడాల సంరక్షణ కమిటీని ఇప్పటి వరకు ఏర్పాటు చేయలేదని పిటిషనర్ వాదనలు వినిపించారు. కమిటీ లేకుండా పనులు చేపట్టడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, పూర్తి వివరాలతో కూడిన నివేదికను సమర్పించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.



