మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి పవన్ కల్యాణ్
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచార బరిలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాల్గొననున్నారు.
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచార బరిలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాల్గొననున్నారు. ఈ నెల 7, 8 తేదీల్లో ఆయన రాష్ట్రంలో పర్యటించనున్నట్లు జనసేన కేంద్ర కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. మిత్రపక్షాలైన బీజేపీ, జనసేన అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ఆయన సభల్లో ప్రసంగించనున్నారు. పవన్ కల్యాణ్ పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ రూపకల్పనలో పార్టీ నిమగ్నమైంది. త్వరలోనే ఆయన ఏయే పట్టణాల్లో ప్రచారం చేస్తారు, ఏ మార్గాల్లో రోడ్ షోలు నిర్వహిస్తారు అనే అంశాలపై స్పష్టత రానుంది. ఏపీ తరహాలోనే తెలంగాణలోనూ బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్న తరుణంలో పవన్ కల్యాణ్ రాక ప్రాధాన్యత సంతరించుకుంది. గత ఎన్నికల్లో బీజేపీకి మద్దతు తెలిపిన జనసేన, ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో ప్రత్యక్షంగా ప్రచారంలో పాల్గొనడం విశేషం. ఈ పర్యటన ద్వారా అటు ఏపీలో, ఇటు తెలంగాణలో తమ కూటమి బలాన్ని చాటాలని జనసేనాని భావిస్తున్నారు.



