కాంగ్రెస్ పాలనలో 'ఆర్ఆర్ ట్యాక్స్' సెగ
On
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి, కమీషన్ల పాలన సాగిస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీబ్ ధ్వజమెత్తారు.
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి, కమీషన్ల పాలన సాగిస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీబ్ ధ్వజమెత్తారు. ఎంవీఎస్ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన విజయ సంకల్ప సమ్మేళనంలో నితిన్ నబీబ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్, రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు, ఎంపీలు డీకే అరుణ, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నితిన్ నబీబ్ రాష్ట్రంలో అభివృద్ధి పనులు జరగాలన్నా, పెండింగ్ బిల్లులు మంజూరు కావాలన్నా 'ఆర్ఆర్ ట్యాక్స్' కట్టాల్సిన దుస్థితి ఏర్పడిందని ఎద్దేవా చేశారు.
హామీల అమలులో విఫలం
ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కిందని నితిన్ నబీబ్ విమర్శించారు. రైతు భరోసా, రుణమాఫీ, వ్యవసాయ కూలీలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరించిందని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ సంక్షేమ పథకాలకు కేటాయించిన నిధుల్లో ప్రభుత్వం కోత విధిస్తోందని చెప్పారు. కేవలం ముస్లిం ఓటు బ్యాంకు కోసమే కాంగ్రెస్ నేతలు ఆరాటపడుతున్నారని ఎద్దేవా చేశారు.
కేంద్రం నుంచి భారీ నిధులు
తెలంగాణ అభివృద్ధికి మోదీ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని నితిన్ నబీబ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టుల కోసం రూ.5,400 కోట్లకు పైగా నిధులు మంజూరయ్యాయని తెలిపారు. తెలంగాణకు మూడు హైస్పీడ్ రైల్ కారిడార్లను కేంద్రం కేటాయించిందని చెప్పారు. రాష్ట్రంలో రెండు భారీ పారిశ్రామిక కారిడార్ల నిర్మాణం శరవేగంగా జరుగుతోందని తెలిపారు.
సనాతన ధర్మంపై దాడులను సహించం
రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం మౌనంగా ఉండటం శోచనీయమని నితిన్ నబీబ్ అన్నారు. ఆలయ భూముల ఆక్రమణలను అడ్డుకోవడంలో విఫలమైందని ఆరోపించారు. సనాతన ధర్మం మీద జరుగుతున్న దాడులను బీజేపీ సహించదని హెచ్చరించారు. వక్ఫ్ బోర్డును బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు.



