విద్యుత్ కనెక్షన్ల జారీలో విప్లవాత్మక మార్పులు

విద్యుత్ కనెక్షన్ల జారీలో విప్లవాత్మక మార్పులు

 రాష్ట్రంలో విద్యుత్ కొత్త కనెక్షన్ల జారీ ప్రక్రియలో గురువారం నుంచి కీలక మార్పులు అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి నూతన మార్గదర్శకాలను జారీ చేసింది.

విశ్వంభర, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో విద్యుత్ కొత్త కనెక్షన్ల జారీ ప్రక్రియలో గురువారం నుంచి కీలక మార్పులు అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. గతంలో అమలులో ఉన్న సంక్లిష్టమైన ఫీజుల విధానానికి స్వస్తి పలికి, వినియోగదారులకు ఊరటనిచ్చేలా ఫిక్స్‌డ్ ఛార్జీలను ఖరారు చేసింది. గతంలో కొత్త కనెక్షన్ పొందాలంటే విద్యుత్ స్తంభాలు, లైన్ల కోసం ఉన్న దూరాన్ని బట్టి ఫీజు వసూలు చేసేవారు. దీనివల్ల వినియోగదారులపై భారీగా ఆర్థిక భారం పడేది. ఇకపై ఆ అవసరం లేకుండా ఒకే రకమైన ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది.
 
గృహ విద్యుత్ కనెక్షన్ల ఛార్జీల వివరాలు
కేంద్ర నిబంధనలకు అనుగుణంగా కొత్త నిబంధనల ప్రకారం.. గృహావసరాలకు తీసుకునే కనెక్షన్లకు ఫీజులు 1 కిలోవాట్ వరకు కేవలం రూ.500 చెల్లిస్తే సరిపోతుంది. 1 నుంచి 5 కిలోవాట్ల వరకు ప్రాథమికంగా రూ.500 తో పాటు, ప్రతి అదనపు కిలోవాట్‌కు రూ.600 చొప్పున వసూలు చేస్తారు. కొత్తగా కనెక్షన్ కోరే వారు 1 కిలోమీటర్ పరిధిలో ఉంటే ఈ ఫిక్స్‌డ్ ఛార్జీల విధానం వర్తిస్తుంది. దీనివల్ల విద్యుత్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం తప్పడమే కాకుండా, అంచనాల పేరుతో జరిగే అవినీతికి అడ్డుకట్ట పడనుంది. స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు అవసరమైతే గరిష్టంగా 90 రోజుల్లోగా ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు. వినియోగదారులు డిస్కం అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు, ఆస్తి పత్రాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తే సరిపోతుంది. దరఖాస్తు ఏ దశలో ఉందో ట్రాక్ చేసే వెసులుబాటు కల్పించారు. పనుల్లో జాప్యం జరిగితే ఆ సమాచారం ఆటోమేటిక్‌గా ఉన్నతాధికారులకు చేరుతుంది.
 
సోలార్, అపార్ట్‌మెంట్ వాసులకు ఊరట
అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల వారు ఓటింగ్ ద్వారా సింగిల్ పాయింట్ కనెక్షన్ కావాలా.. లేక వ్యక్తిగత కనెక్షన్లు కావాలా అనేది నిర్ణయించుకోవచ్చు. 10 కిలోవాట్ల వరకు రూఫ్-టాప్ సోలార్ ప్యానెల్స్ అమర్చుకునే వారికి టెక్నికల్ ఫీజిబిలిటీ స్టడీ అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో కొత్త కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లను తప్పనిసరి చేయడం ద్వారా రీడింగ్‌లో అక్రమాలకు అడ్డుకట్ట పడనుంది.