కోల్‌కతాలో విమానం అత్యవసర ల్యాండింగ్
కాఠ్‌మాండు నుంచి ఇస్తాంబుల్ బయలుదేరిన తుర్కియే ఎయిర్‌లైన్స్ విమానంలో ఒక్కసారిగా కలకలం రేగింది.
విశ్వంభర, నేషనల్ బ్యూరో: కాఠ్‌మాండు నుంచి ఇస్తాంబుల్ బయలుదేరిన తుర్కియే ఎయిర్‌లైన్స్ విమానంలో ఒక్కసారిగా కలకలం రేగింది. టేకాఫ్ అయిన నాలుగు నిమిషాలకే కుడి వైపు ఇంజిన్ నుంచి మంటలు రావడం ప్రయాణికులను భయాందోళనకు గురిచేసింది. ఇంజిన్‌లో మంటలను గుర్తించిన వెంటనే పైలట్ ఆ ఇంజిన్‌ను నిలిపివేశారు. పరిస్థితి తీవ్రతను కాఠ్‌మాండు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు వివరించారు. సింగిల్ ఇంజిన్‌తో సుదీర్ఘ ప్రయాణం ప్రమాదకరమని భావించిన సిబ్బంది, దగ్గరలోని కోల్‌కతా విమానాశ్రయానికి మళ్లించారు. గగనతలంలో కొంతసేపు చక్కర్లు కొట్టిన అనంతరం విమానాన్ని సురక్షితంగా అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఆ సమయంలో విమానంలో మొత్తం 236 మంది ప్రయాణికులు ఉన్నారు. పైలట్ నుంచి ‘ప్యాన్ ప్యాన్’ సిగ్నల్ రాగానే.. నిబంధనల ప్రకారం అన్ని చర్యలు తీసుకున్నట్లు పౌర విమానయానశాఖ వెల్లడించింది.



