అభివృద్ధి పనులకు శ్రీకారం
- పాల్గొన్న నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి
విశ్వంభర, సంగారెడ్డి: రామచంద్రాపురం డివిజన్‌లో రూ.40 కోట్ల 70 లక్షల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలను స్థానిక కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజి రెడ్డి పాల్గొన్నారు. అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా రామచంద్రాపురం శ్రీనివాస్ నగర్ కాలనీలోని సోమేశ్వర ఆలయం వద్ద కమ్యూనిటీ హాల్ నిర్మాణం, రామచంద్రాపురంలో సీసీ రోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులు, అలాగే శ్రీనివాస్ నగర్‌లో గాంధీ బాలవిహార్ పార్క్ అభివృద్ధి, ఓల్డ్ రామచంద్రాపురంలో మీట్ మార్కెట్ నిర్మాణం చేపట్టనున్నారు. ఇదే విధంగా హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో రాయసముద్రం చెరువు సుందరీకరణ, చెరువు నుంచి మురికి నీరు మళ్లించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. రామచంద్రారెడ్డి నగర్‌లో సీసీ రోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులు, కాకతీయ నగర్ కాలనీలో హెచ్ఎండిఏ నిధులతో థీమ్ పార్క్ నిర్మాణం, అలాగే అక్కడ సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు చేపట్టనున్నారు. ఈ అన్ని అభివృద్ధి పనులపై మొత్తం రూ.40.70 కోట్ల నిధులు వెచ్చించనున్నట్లు బూరుగడ్డ పుష్పనగేష్ తెలిపారు. అభివృద్ధి పనులు పూర్తయితే రామచంద్రాపురం డివిజన్ మరింత సుందరంగా మారడంతో పాటు ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.



