కాంగ్రెస్ ఒక్కొక్కరికి రూ.60 వేల బాకీ
- బీఆర్ఎస్
విశ్వంభర-సిద్దిపేట: రాష్ట్రంలోని ఒక్కొక్కరికి రూ.60 వేలు కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడిందని బీఆర్ఎస్ సిద్దిపేట పట్టణ అధ్యక్షుడు సంపత్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకుడు ఎల్లు రవీందర్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని 14వార్డులో బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన హామీల బాకీ కార్డులను మంగళవారం ఇంటింటికీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో దివ్యాంగులు, వృద్ధులు, వితంతుల పింఛన్లు పెంచుతామని హామీనిచ్చి 25 నెలలు గడిచినా.. నెరవేర్చలేదన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు సూచనలతో కాంగ్రెస్ మోసపూరిత విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని చెప్పారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను భూస్తాపితం చేస్తామన్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన ఏ ఒక్క హామీని కూడా ఇప్పటివరకు నెరవేర్చలేదన్నారు. కార్యక్రమంలో నాయకులు కంటెం రాజు, నర్సింలు, ప్రభాకర్ రెడ్డి, పత్రి శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.



