రైతు భరోసాపై కీలక ప్రకటన

రైతు భరోసాపై కీలక ప్రకటన

రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పర్యటనలో భాగంగా గూడూరులో ఇంటిగ్రేటెడ్ స్కూల్‌కు రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు.

విశ్వంభర, తెలంగాణ బ్యూరో: రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పర్యటనలో భాగంగా గూడూరులో ఇంటిగ్రేటెడ్ స్కూల్‌కు రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. మున్సిపల్ ఎన్నికలు పూర్తి కాగానే రైతు భరోసా నిధులను నేరుగా అన్నదాతల ఖాతాల్లో జమ చేస్తామని హామీ ఇచ్చారు. వరి ఉత్పత్తిలో ఆసియాలోనే మిర్యాలగూడ అగ్రస్థానంలో ఉండటం గర్వకారణమని కొనియాడారు. రైతు సంక్షేమం కోసం ఇప్పటి వరకు మొత్తం రూ.1.10 లక్షల కోట్లు ఖర్చు చేశామని వివరించారు. సన్నబియ్యం పథకం ద్వారా ప్రయోజనం పొందుతున్న వారు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
 
అధికారంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే అనేక ప్రజాహిత కార్యక్రమాలను అమలు చేశామని సీఎం గుర్తు చేశారు. తాము చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు ఓటు వేయాలని కోరారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల వివరాలను రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇప్పటి వరకు 25.35 లక్షల మంది రైతులకు రూ.21 వేల కోట్ల రుణాలను మాఫీ చేశామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గత పాలకులు వరి వేస్తే ఉరి అన్నచోట, క్వింటాల్‌కు రూ.500 బోనస్ అందిస్తున్నామని తెలిపారు. 3.17 కోట్ల మంది నిరుపేదలకు 6 కిలోల సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. పేదల ఇళ్లకు ఉచితంగా కరెంట్ సరఫరా చేస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు.