బనకచర్లపై తెలంగాణ ప్రభుత్వం న్యాయపోరాటం

బనకచర్లపై తెలంగాణ ప్రభుత్వం న్యాయపోరాటం

కృష్ణా నది జలాల వాటా, ప్రాజెక్టుల నిర్వహణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం తన దూకుడు పెంచింది.

విశ్వంభర, తెలంగాణ బ్యూరో: కృష్ణా నది జలాల వాటా, ప్రాజెక్టుల నిర్వహణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం తన దూకుడు పెంచింది. ఏపీ నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు కలిగే నష్టాలను వివరిస్తూ పక్కా ఆధారాలతో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే లీగల్ సెల్ నిపుణులు ముసాయిదాను సిద్ధం చేస్తున్నారు. డ్రాఫ్ట్ పూర్తయిన తర్వాత అడ్వకేట్ జనరల్ తో చర్చించి, తుది మెరుగులు దిద్ది సుప్రీంకోర్టులో సూట్ దాఖలు చేయనున్నారు.

పోలవరం - నల్లమల లింకుపై వెనక్కి.. 
గతంలో పోలవరం-నల్లమల సాగర్ లింకు ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. అయితే, సాంకేతిక కారణాల వల్ల దాన్ని వెనక్కి తీసుకున్నామని, ఇప్పుడు మరింత సమర్థవంతంగా 'సివిల్ సూట్' రూపంలో మళ్ళీ దాఖలు చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. అనుమతులు లేకుండా ఏపీ చేపడుతున్న ప్రాజెక్టులను అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ అడుగులు వేస్తోంది.

Read More నకిరేకల్ ఎమ్మెల్యే తో రాపోలు భేటీ.  చేనేత సమస్యలపై చర్చ. 

సమ్మక్క సాగర్ ఎన్వోసీపై నజర్
రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు అవసరమైన అనుమతుల కోసం ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వంతో త్వరలో చర్చలు జరుపుతామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.  అంతరాష్ట్ర జల వివాదాలను పరిష్కరించుకుంటూనే, మన హక్కుల కోసం సుప్రీంకోర్టులో పోరాడుతామని వెల్లడించారు.

బనకచర్ల వద్ద ఏపీ ప్రభుత్వం నీటిని మళ్లిస్తున్న తీరుపై తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచీ ఆగ్రహంగా ఉంది. ఈ ప్రాజెక్టుపై న్యాయపరంగా స్టే తీసుకురావడంతో పాటు, తెలంగాణ వాటాను కాపాడుకునేలా గట్టి వాదనలు వినిపించేందుకు ఇరిగేషన్ శాఖ అంతర్గత సమీక్షలను ముమ్మరం చేసింది.