ఘనంగా అంతర్జాతీయ మహిళా వైద్యుల దినోత్సవం
విశ్వంభర, నల్లకుంట : మాతృత్వంలో ఓర్పుని, వైద్య వృత్తిలో సేవాభావాన్ని మేళవించి ఎంతో మంది ప్రాణాలు నిలబెడుతున్న మహిళా వైద్యుల సేవలు వెలకట్టలేనివని పలువురు అన్నారు. నగరంలో పలుచోట్ల అంతర్జాతీయ మహిళా వైద్యుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు .కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం నల్లకుంటలో అంతర్జాతీయ మహిళా వైద్యుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వైద్య రంగంలో విశేష సేవలందిస్తున్న పలువురు మహిళా వైద్యులను సత్కరించారు. టీపీసీసీ కార్యదర్శి ఎన్. అజయ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎస్. హరినాథ్ రెడ్డి, దేవిరెడ్డి విజితా రెడ్డి తదితరులు స్థానిక ఫీవర్ ఆసుపత్రిలో సీఎస్ ఆర్ఎంవో డాక్టర్ ఎ. జయలక్ష్మి, డిప్యూటి ఆర్ఎంవోలను శాలువాతో సన్మానించి మాట్లాడారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వైద్య రంగంలో విశేష సేవలందిస్తున్న మహిళా వైద్యులకు అభినందనలు తెలిపారు. ఆరోగ్య సంరక్షణలో మహిళా డాక్టర్ల పాత్ర, త్యాగాలు, సేవలు మరువలేనివని కొనియాడారు. సీఎస్ ఆర్ఎంవో డాక్టర్ జయలక్ష్మి మాట్లాడుతూ.. మొదటి మహిళా వైద్యురాలు డాక్టర్ ఎలిజబెత్ బ్లాక్వెల్ జన్మదినం రోజున అంతర్జాతీయ మహిళా వైద్యుల రోజు జరుపుకోవడం ముదావహం అన్నారు. ఎలిజబెత్ వైద్య పట్టాపొందిన మొదటి మహిళగా చరిత్ర సృష్టించి, మహిళలకు వైద్య రంగంలో దారి చూపారన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి అజయ్ కుమార్, సీనియర్ నాయకులు ఎస్. హరినాధ్ రెడ్డి, దేవిరెడ్డి విజితా రెడ్డి, కె. మధుసూధన్ నేత, శరత్ బాబు, బొమ్మిడి శ్రవణ్ కుమార్, కె. లక్ష్మణ్, మధుసూధన్ రెడ్డి, కేఎస్. శ్రీకాంత్ నేత తదితరులు పాల్గొన్నారు.



