విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలి
విశ్వంభర, బాగ్‌లింగంపల్లి: విద్యార్థి సంఘాలకు ఎన్నికలు రద్దు చేయడం వల్లే దేశంలో నియంతృత్వ, ఫాసిస్టు ధోరణులు పెరుగుతున్నాయని మేధావులు ఆందోళన వ్యక్తం చేశారు. పీడీఎస్‌యూ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాదు బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విద్యార్థి సంఘాలకు తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు పి. మహేష్ అధ్యక్షత వహించారు. ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ ఎన్నికల ద్వారా విద్యార్థుల్లో రాజకీయ, సామాజిక, సాంస్కృతిక చైతన్యం పెరుగుతుందని, హక్కులపై పోరాడే స్పృహ వస్తుందన్నారు. ఎన్నికలు లేకపోవడం వల్ల పాలకులు నియంతృత్వ చర్యలను కొనసాగిస్తున్నారని విమర్శించారు. లింగ్డో కమిటీ సిఫారసులు, ప్రభుత్వ హామీలను గుర్తు చేస్తూ వెంటనే ఎన్నికలు నిర్వహించాలని కోరారు. అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఈ. ఉపేందర్, దుబ్బా రంజిత్, పీడీఎస్‌యూ, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎఫ్‌డీఎస్, ఏఐడీఎస్‌వో నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసి, విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భువనగిరి మధు, కే. శ్రీనివాస్, సందీప్, కూతాటి రాణా ప్రతాప్, మంద నవీన్ తదితరులు పాల్గొన్నారు.



