క్యాన్సర్ పై అవగాహన సదస్సు 

క్యాన్సర్ పై అవగాహన సదస్సు 

విశ్వంభర, మహబూబాబాద్:  ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం అనేది క్యాన్సర్‌పై అవగాహన పెంచడం, ప్రారంభ దశలో గుర్తింపు ప్రోత్సహించడం, సమయానికి సమర్థవంతమైన చికిత్స అందేలా చేయడం లక్ష్యంగా ఉన్న ప్రపంచవ్యాప్త కార్యక్రమని జిల్లా వైద్య ఆరోగ్య శాకాధికారి డాక్టర్ రవి రాథోడ్  అన్నారు.  ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం ను పురస్కరించుకొని జిల్లా వైద్య ఆరోగ్య శాఖా కార్యలయం లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ,   ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4న ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4వ తేదీన జరుపుకునే 'ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం' కేవలం ఒక రోజుకు పరిమితమైన కార్యక్రమం కాదని అది మానవాళి మనుగడ కోసం సాగిస్తున్న నిరంతర సమరం అని ఆయన అన్నారు. నేడు క్యాన్సర్ మహమ్మారి విలయ తాండవం చేస్తుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో  2016లో 43 వేల కేసులు ఉండగా, 2019 నాటికి ఆ సంఖ్య 46, 464కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఏటా సుమారు 55,000 కొత్త కేసులు నమోదవుతున్నాయని, రాబోయే ఐదేళ్లలో ఈ సంఖ్య 65,000 దాటవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారని తెలిపారు. మాతా శిశు సంక్షేమ ప్రోగ్రాం అధికారి డాక్టర్ సారంగం మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాప్తికి 60 శాతానికి పైగా కారణాలు మన జీవనశైలితో ముడిపడి ఉండటం గమనార్హమని  అన్నారు. దేశంలో క్యాన్సర్ మరణాలకు ప్రధాన కారణం పొగాకు, ధూమపానం, గుట్కా, ఖైనీ వంటి వాటి వల్ల నోటి, ఊపిరితిత్తుల, గొంతు క్యాన్సర్లు ప్రబలుతున్నాయన్నారు. నోడల్ అధికారి డాక్టర్ ప్రత్యూష మాట్లాడుతూ, చాలామంది రోగులు వ్యాధి ముదిరిన తర్వాత ఆసుపత్రులకు వస్తున్నారాణి, గ్రామీణ ప్రాంతాల్లో స్క్రీనింగ్ సౌకర్యాలు లేకపోవడం, పేదరికం, క్యాన్సర్ అంటే మరణమే అనే అపోహల వల్ల వ్యాధిని ప్రాథమిక దశలో గుర్తించలేకపోతున్నారని పేర్కొన్నారు. టి‌బి, ఎయిడ్స్  అండ్ లేప్రసి ప్రోగ్రాం అధికారి డాక్టర్ విజయ్ మాట్లాడుతూ,  క్యాన్సర్ను జయించాలంటే కార్పొరేట్ ఆసుపత్రుల కంటే ముందుగా పల్లెల్లో నిఘా పెరగాలని,  ఈ క్రమంలో ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎం లు ఆరోగ్య వ్యవస్థకు రెండు కళ్లుగా వ్యవహరిస్తున్నారన్నారు.  ఈ  కార్యక్రమం  జిల్లా అసంక్రమణ వ్యాధుల ప్రోగ్రాం అధికారి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో  తొర్రూర్ డిప్యూటీ డి‌ఎం‌హెచ్‌ఓ డాక్టర్ సుధీర్ రెడ్డి ప్రోగ్రాం అధికారులు డాక్టర్ సారంగం, డాక్టర్ సుమన్ కల్యాణ్, డాక్టర్ విజయ్, డాక్టర్ ప్రత్యూష, జిల్లా డిప్యూటీ మాస్ మీడియా అధికారి కొప్పు ప్రసాద్, ఆరోగ్య విద్యాబోధకులు కే‌వి రాజు, పురుషోత్తమ్, శారద, సి‌హెచ్‌ఓ విద్యాసాగర్, సుపెర్వైజర్లు, ఎం‌పి‌హెచ్‌ఈ‌ఓ లు, తదితరులు పాల్గొన్నారు

Tags: