మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 52 శాతం బీఫాంలు ఇవ్వాలి

మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 52 శాతం బీఫాంలు ఇవ్వాలి

  •  భరత్ కుమార్

విశ్వంభర, హైదరాబాదు:  మున్సిపల్ ఎన్నికల్లో  అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు 52 శాతం బీఫాంలు కేటాయించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గవ్వల భరత్ కుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం నగరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత సర్పంచ్ ఎన్నికల్లో బీసీలు జనరల్ స్థానాల్లోనే 52 శాతం విజయం సాధించారని గుర్తుచేశారు. ఇది బీసీల రాజకీయ సామర్థ్యానికి, ప్రజాదరణకు నిదర్శనమని పేర్కొన్నారు. అయినా ఎన్నికలు వచ్చేసరికి బీసీలకు తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవడం అన్యాయమని విమర్శించారు. దేశ జనాభాలో మెజారిటీగా ఉన్న బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడంలో అన్ని పార్టీలు విఫలమవుతున్నాయని ఆరోపించారు. మాటలకే పరిమితమయ్యే బీసీ హామీలు ఇకనైనా ఆచరణలోకి రావాలని అన్నారు. బీసీలకు బీఫాంలు కేటాయించకపోతే పార్టీలకు అతీతంగా బీసీ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బీసీల రాజకీయ హక్కులు కాపాడాలంటే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల నుంచే న్యాయమైన ప్రాతినిధ్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. బీసీలకు 52 శాతం బీఫాంలు కేటాయించినప్పుడే ప్రజాస్వామ్యానికి అర్థం ఉంటుందని వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో తెలంగాణ బీసీ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కంచిగారి ప్రవీణ్, బీసీ సంఘం గ్రేటర్ హైదరాబాదు అధ్యక్షులు అభిలాష్ గౌడ్, గ్రేటర్ హైదరాబాదు బీసీ యువజన సంఘం అధ్యక్షులు విశాల్ పటేల్, బీసీ సంఘం మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా అధ్యక్షులు సుమన్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాశ్యప్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Tags: