ఓటర్ల జాబితా సవరణపై సుప్రీంకోర్టు సీరియస్
On
పశ్చిమ బెంగాల్ ఓటర్ల జాబితా ప్రత్యేక పరిశీలన వ్యవహారంపై సుప్రీంకోర్టు బుధవారం కీలక విచారణ చేపట్టింది.
విశ్వంభర, నేషనల్ బ్యూరో: పశ్చిమ బెంగాల్ ఓటర్ల జాబితా ప్రత్యేక పరిశీలన వ్యవహారంపై సుప్రీంకోర్టు బుధవారం కీలక విచారణ చేపట్టింది. ఈ ప్రక్రియలో చోటుచేసుకుంటున్న లోపాలపై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కేంద్ర ఎన్నికల సంఘానికి (ECI) నోటీసులు జారీ చేస్తూ, తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
స్పెల్లింగ్ తప్పులకు నోటీసులా?
ఓటర్ల పేర్లలో చిన్నపాటి అక్షర దోషాలు ఉన్నంత మాత్రాన నోటీసులు జారీ చేయడంపై ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. ప్రాంతీయ యాస కారణంగా పేర్ల ఉచ్ఛారణలో, స్పెల్లింగ్స్‌లో మార్పులు రావడం సహజమని కోర్టు అభిప్రాయపడింది. ప్రముఖ కవి జోయ్ గోస్వామి వంటి మహానుభావులను కూడా 'గుర్తించని వ్యక్తులు'గా పేర్కొనడంపై అధికారుల విచక్షణను ప్రశ్నించింది. బెంగాలీ భాష తెలిసిన అధికారుల సహాయంతో ఈ పొరపాట్లను సరిదిద్దాలని సూచించింది.
కోర్టులో మమతా బెనర్జీ వాదనలు
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా కోర్టుకు హాజరై తన వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా ఆమె పలు సంచలన అంశాలను కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఎన్నికల వేళ కేవలం బెంగాల్‌ను మాత్రమే లక్ష్యంగా చేసుకుని ఈ ప్రక్రియను వేగంగా చేపడుతున్నారని ఆరోపించారు. ఇప్పటికే 58 లక్షల మంది ఓటర్ల పేర్లను తొలగించారని, సుమారు కోటి మందికి నోటీసులు ఇచ్చారని తెలిపారు. బ్రతికి ఉన్న వ్యక్తులను కూడా చనిపోయినట్లుగా జాబితాలో చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నివాస ధ్రువీకరణ కోసం ఆధార్ కార్డులను అధికారులు అంగీకరించడం లేదని ఫిర్యాదు చేశారు.
మైక్రో అబ్జర్వర్ల పాత్రపై ప్రశ్నలు
ఎన్నికల సంఘం నియమించిన మైక్రో అబ్జర్వర్లు ఇష్టానుసారంగా పేర్లను తొలగిస్తున్నారని మమతా బెనర్జీ పేర్కొన్నారు. దీనిపై స్పందించిన కోర్టు, ప్రతి పత్రాన్ని బూత్ లెవల్ ఆఫీసర్లు తప్పనిసరిగా ధృవీకరించేలా ఆదేశాలు ఇస్తామని హామీ ఇచ్చింది. ఓటర్ల జాబితా సవరణ పారదర్శకంగా ఉండాలని, సామాన్య ప్రజలు ఇబ్బంది పడకూడదని స్పష్టం చేసింది.



