ఉగాది రోజున 'గద్దర్ ఫిల్మ్ అవార్డులు'

ఉగాది రోజున 'గద్దర్ ఫిల్మ్ అవార్డులు'

విశ్వంభర, తెలంగాణ బ్యూరో: తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల కమిటీతో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అవార్డుల ప్రదానోత్సవానికి సంబంధించిన కీలక తేదీలను ఆయన ప్రకటించారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మార్చి 19న ఈ ప్రతిష్టాత్మక పురస్కారాలను అందజేయనున్నట్లు తెలిపారు. అవార్డుల ఎంపిక ప్రక్రియలో భాగంగా చిత్రాల ప్రదర్శన ఫిబ్రవరి 6 నుంచి ప్రారంభం కానుంది. ప్రతిభ, పారదర్శకత ప్రాతిపదికన విజేతలను నిర్ణయించనున్నారు. కమర్షియల్ అంశాలతో పాటు సామాజిక బాధ్యతను గుర్తుచేసే సినిమాలకు ఈ పురస్కారాల్లో ప్రాధాన్యత ఉంటుందని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు.
 
హైదరాబాద్.. ఇండియన్ సినిమా హబ్
భారతీయ సినీ రంగానికి హైదరాబాద్ నగరాన్ని ప్రధాన కేంద్రంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే ఒక బ్లూ ప్రింట్‌ను సిద్ధం చేస్తోందని వెల్లడించారు. ప్రజా యుద్ధనౌక గద్దర్ తన కళ ద్వారా సమాజం కోసం జీవితాన్ని త్యాగం చేశారని ఆయన కొనియాడారు. గతేడాది తరహాలోనే ఈసారి కూడా అత్యంత వైభవంగా వేడుకలను నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.
 
సచివాలయంలో జరిగిన ఈ భేటీలో తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TFDC) ఛైర్మన్ దిల్ రాజు పాల్గొన్నారు. వీరితో పాటు ఎఫ్‌డీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కిషోర్ బాబు, ప్రముఖ నటులు తనికెళ్ల భరణి, నిర్మాత కేఎస్ రామారావు, నటి రోజా రమణి, అశోక్ కుమార్ పాల్గొన్నారు.