సమ్మక్కసాగర్ ముంపుపై ఛత్తీస్‌గఢ్ అప్రమత్తం
On
రాష్ట్రంలో గోదావరి నదిపై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సమ్మక్కసాగర్ ప్రాజెక్టు ఇప్పుడు సరిహద్దు రాష్ట్రాల మధ్య చర్చనీయాంశంగా మారింది.
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో గోదావరి నదిపై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సమ్మక్కసాగర్ ప్రాజెక్టు ఇప్పుడు సరిహద్దు రాష్ట్రాల మధ్య చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే ప్రవహించే బ్యాక్‌వాటర్ (వెనక్కి తన్నే నీరు) వల్ల తమ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా ముంపునకు గురయ్యే అవకాశం ఉందని ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రాజెక్టు పూర్తి రిజర్వాయర్ స్థాయికి చేరుకున్నప్పుడు ఏయే ప్రాంతాలు జలమయం అవుతాయో తెలుసుకోవడానికి సమగ్ర అధ్యయనం అవసరమని ఆ రాష్ట్ర జలవనరుల శాఖ నిర్ణయించింది.
సర్వే వ్యయం రూ. 9.88 కోట్లు
ఈ అధ్యయనానికి అయ్యే ఖర్చును భరించాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వానికి ఛత్తీస్‌గఢ్ అధికారులు లేఖ రాశారు. ప్రాజెక్టు ప్రభావాన్ని అంచనా వేయడానికి చేపట్టే సర్వే కోసం సుమారు రూ.9.88 కోట్ల నిధులు అవసరమని అంచనా వేశారు. సరిహద్దుల నిర్ధారణ, బ్యాక్‌వాటర్ ప్రవాహ దిశ, ప్రభావితమయ్యే గ్రామాల గుర్తింపు వంటి కీలక అంశాలపై ఈ సర్వే సాగనుంది. తెలంగాణ ప్రభుత్వం ఈ నిధులను విడుదల చేసిన వెంటనే క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభిస్తామని ఛత్తీస్‌గఢ్ స్పష్టం చేసింది.
పాత ఒప్పందాల అమలు
గతంలో సెప్టెంబర్ 22న ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ ఉన్నతాధికారుల మధ్య జరిగిన భేటీలో కొన్ని కీలక ఒప్పందాలు కుదిరాయి. సమ్మక్కసాగర్ ప్రాజెక్టు వల్ల ఛత్తీస్‌గఢ్ భూభాగంలో మునిగిపోయే భూములు, ఆస్తులు, గ్రామాల పునరావాసానికి సంబంధించిన అన్ని ఖర్చులను తెలంగాణ రాష్ట్రమే భరించాలని ఆ ఒప్పందంలో పేర్కొన్నారు. ఇప్పుడు ఆ నిబంధనల మేరకే సర్వే నిధులను ఛత్తీస్‌గఢ్ కోరుతోంది. ఈ అధ్యయన నివేదిక అందిన తర్వాతే ప్రాజెక్టుకు సంబంధించిన తదుపరి అనుమతులపై ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఒక స్పష్టతకు వచ్చే అవకాశం ఉంది.



