'సింగరేణి'ని బీఆర్‌ఎస్ ముంచేసింది: కిషన్ రెడ్డి
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సింగరేణి కాలరీస్ సంస్థను నాశనం చేశారని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సింగరేణి కాలరీస్ సంస్థను నాశనం చేశారని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సింగరేణి దుస్థితికి గత పాలకుల అవినీతి, నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో సింగరేణి బోర్డు కేవలం నామమాత్రంగానే ఉండేదని కిషన్‌రెడ్డి విమర్శించారు. వారి హయాంలోనే ఆ సంస్థ అప్పులు భారీగా పెరిగాయని ఎద్దేవా చేశారు. టెండర్ల కేటాయింపు నుంచి కాంట్రాక్టుల వరకు అన్నీ కేసీఆర్ కుటుంబ సభ్యులే పర్యవేక్షించేవారని తెలిపారు. బోర్డు సమావేశ వివరాలు కూడా కనీసం తన దృష్టికి రాకుండా గోప్యత పాటించేవారని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఆనాటి సీఎండీని మరో నాలుగేళ్లు అదనంగా కొనసాగించి, సంస్థను తమ గుప్పిట్లో పెట్టుకున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు.
పేరుకుపోయిన అప్పులు.. అస్తవ్యస్తంగా నిధులు
సింగరేణి ఆర్థిక పరిస్థితిపై కిషన్‌రెడ్డి పలు కీలక గణాంకాలను బయటపెట్టారు. గత పదేళ్లలో సింగరేణి అప్పులు రూ.32,000 కోట్లకు పైగా పెరిగాయన్నారు. జెన్‌కో, ట్రాన్స్‌కోలు సింగరేణి విద్యుత్‌ను వాడుకుని డబ్బులు చెల్లించలేదని తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం కార్మికులకు, సంస్థకు సుమారు రూ.47,000 కోట్లు చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు. నిధుల కొరత సాకుతో జిల్లాలకు అందాల్సిన రూ.1,500 కోట్ల డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ (DMF) కూడా నిలిపివేశారని పేర్కొన్నారు. సంస్థ సామాజిక బాధ్యత (CSR) నిధులను కూడా బీఆర్ఎస్ నేతలు తమ స్వార్థం కోసం దుర్వినియోగం చేశారని ఆరోపించారు.
ప్రైవేటు శక్తులకు పెద్దపీట
కేంద్రం సింగరేణిని ప్రైవేటీకరిస్తోందంటూ గతంలో బీఆర్ఎస్ చేసిన ప్రచారాన్ని కిషన్‌రెడ్డి తిప్పికొట్టారు. "సింగరేణిపై కేంద్రం అజమాయిషీ ఎప్పుడూ లేదు. కానీ, బీఆర్ఎస్ హయాంలోనే ప్రైవేటు కంపెనీలకు అడ్డగోలుగా పనులు కట్టబెట్టారు. అప్పుడు లేని ప్రైవేటీకరణ భయం ఇప్పుడెందుకు?" అని ప్రశ్నించారు. ప్రస్తుతం ఇన్‌ఛార్జ్ సీఎండీతో కాలం గడుపుతుండటం సంస్థ నిర్లక్ష్యానికి అద్దం పడుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. "తెలంగాణ జీవనాడి అయిన సింగరేణిని గత ప్రభుత్వం ఒక రాజకీయ ఏటీఎంలా వాడుకుంది. నిధుల మళ్లింపు, కుటుంబ సభ్యుల జోక్యంతో సంస్థను సంక్షోభంలోకి నెట్టారు." కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు.



