గ్యాస్ కొరతపై సిపిఎం నిరసన
విశ్వంభర, చిక్కడపల్లి : దేశంలో గ్యాస్ కొరతకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విదేశాంగ విధానమే ప్రధాన కారణం అని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యురాలు టి. జ్యోతి అన్నారు. డొమెస్టిక్, కమర్షియల్ గ్యాస్ కొరతను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శనివారం సిపిఎం గ్రేటర్ హైదరాబాదు సెంట్రల్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాదు గోల్కొండ చౌరస్తా నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద పొయ్యిలో కట్టెలు వేసి వంట చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న గ్యాస్ సమస్యలకు కేంద్ర ప్రభుత్వ విధానాలే కారణమని విమర్శించారు. గతంలో మూడవ ప్రపంచ దేశాలతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించడంతో భారత్‌కు గౌరవం ఉండేదని, ప్రస్తుతం అమెరికా, ఇజ్రాయిల్‌తో భాగస్వామ్యం పెరగడం వల్ల పరిస్థితులు మారాయని పేర్కొన్నారు. అమెరికాతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సిపిఎం గ్రేటర్ హైదరాబాదు సెంట్రల్ సిటీ కమిటీ కార్యదర్శి ఎం. వెంకటేష్ మాట్లాడుతూ దేశంలో సుమారు 33 కోట్ల గ్యాస్ కనెక్షన్లు, తెలంగాణలో ఒక కోటి 30 లక్షల కనెక్షన్లు ఉన్నాయని తెలిపారు. గ్యాస్ బుకింగ్ వ్యవస్థలో సమస్యల కారణంగా వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. నగరంలో హోటళ్ల కార్యకలాపాలు కూడా ప్రభావితమవుతు న్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శివర్గ సభ్యులు ఎం. శ్రీనివాసరావు, ఎం. మహేందర్, కే.ఎన్. రాజన్న, ఎం. దశరథ్, నగర కమిటీ సభ్యులు ఆర్. వెంకటేష్, జె. కుమారస్వామి, ఎన్. మారన్న, సి. మల్లేష్, ఆర్. అశోక్, జి. నరేష్, నాయకులు రమాదేవి, లీల తదితరులు పాల్గొన్నారు.



