ఎన్టీవీ జర్నలిస్టుల అరెస్టు
బ్యాంకాక్ వెళ్తుండగా విమానాశ్రయంలో అదుపులోకి..
తెలంగాణ మీడియా రంగంలో పెను సంచలనం చోటుచేసుకుంది. ప్రముఖ తెలుగు వార్తా సంస్థ 'ఎన్టీవీ' (NTV) కి చెందిన సీనియర్ జర్నలిస్ట్, ఇన్‌పుట్ ఎడిటర్ దొంతు రమేష్ ను హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు (CCS) పోలీసులు శంషాబాద్ విమానాశ్రయంలో అరెస్టు చేశారు.
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: తెలంగాణ మీడియా రంగంలో పెను సంచలనం చోటుచేసుకుంది. ప్రముఖ తెలుగు వార్తా సంస్థ 'ఎన్టీవీ' (NTV) కి చెందిన సీనియర్ జర్నలిస్ట్, ఇన్‌పుట్ ఎడిటర్ దొంతు రమేష్ ను హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు (CCS) పోలీసులు శంషాబాద్ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి బ్యాంకాక్ విహారయాత్రకు వెళ్లేందుకు సిద్ధమైన తరుణంలో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకోవడం గమనార్హం. అదేవిధంగా, ఈ కేసులో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ఇద్దరు రిపోర్టర్లు పరిపూర్ణా చారి, సుధీర్‌లను కూడా పోలీసులు అరెస్టు చేశారు.
అసలేం జరిగింది..?
గత వారం (జనవరి 8న) ఎన్టీవీలో ప్రసారమైన ఒక వార్తా కథనం ఈ అరెస్టులకు ప్రధాన కారణమైంది. నల్గొండ జిల్లాకు చెందిన ఓ మంత్రి, ఒక మహిళా ఐఏఎస్ (IAS) అధికారిణి మధ్య అక్రమ సంబంధం ఉందంటూ ఆ ఛానల్ ఒక కథనాన్ని ప్రసారం చేసింది. ఎటువంటి ఆధారాలు లేకుండా, కేవలం వ్యక్తిత్వ హననం చేసే ఉద్దేశంతోనే ఈ తప్పుడు కథనాన్ని ప్రసారం చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో తమ సహోద్యోగిపై సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో జరిగిన ఈ దుష్ప్రచారాన్ని ఐఏఎస్ అధికారుల సంఘం తీవ్రంగా పరిగణించింది. ఈ మేరకు జనవరి 10న ఐఏఎస్ అసోసియేషన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (CCS) పోలీసులు FIR నమోదు చేశారు. తప్పుడు సమాచారంతో మహిళా అధికారిణి ప్రతిష్ఠకు భంగం కలిగించారనే అభియోగాలపై ఈ దర్యాప్తు కొనసాగుతోంది.
అరెస్టైన దొంతు రమేష్, పరిపూర్ణా చారి, సుధీర్‌లను పోలీసులు జనవరి 14న మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఎన్టీవీ అధినేత నరేంద్ర చౌదరి, సీఈవో రాజశేఖర్ ప్రస్తుతం అందుబాటులో లేరని, వారు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు అనధికారిక సమాచారం అందుతోంది. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు ప్రాథమిక దశలో ఉందని, మరిన్ని కీలక వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని పోలీస్ వర్గాలు పేర్కొన్నాయి.



