ఆర్చరీలో సముద్రాల అఖిల్‌కు స్వర్ణం

ఆర్చరీలో సముద్రాల అఖిల్‌కు స్వర్ణం

విశ్వంభర, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లాకు చెందిన వర్ధమాన ఆర్చర్ సముద్రాల అఖిల్ జాతీయ స్థాయిలో మరోసారి తన సత్తా చాటారు. ఖేలో ఇండియా సీనియర్ సౌత్ జోన్ నేషనల్ ఆర్చరీ ఛాంపియన్‌షిప్ 2026 పోటీలు పుదుచ్చేరిలో ఫిబ్రవరి 27 నుండి మార్చి 1 వరకు నిర్వహించగా, అఖిల్ అద్భుత ప్రదర్శనతో బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఈ విజయం అఖిల్ కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. 2024లో ఇదే ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్న ఆయన, ఇప్పుడు 2026లో కూడా స్వర్ణం సాధించి వరుసగా రెండోసారి టైటిల్‌ను నిలబెట్టుకోవడం విశేషం. దక్షిణ భారతదేశంలోని ప్రతిభావంతులైన ఆర్చర్లను వెనక్కి నెట్టి ఆయన సాధించిన ఈ అద్భుత విజయం క్రీడా లోకంలో ప్రశంసలు అందుకుంటోంది. అఖిల్ సాధించిన ఈ ఘన విజయంపై మహబూబాబాద్ జిల్లా యువజన మరియు క్రీడల అధికారి డా. ఓలేటి జ్యోతి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. “సముద్రాల అఖిల్ సాధించిన ఈ విజయం మన జిల్లాకే గర్వకారణం. వరుసగా రెండోసారి జాతీయ స్థాయి సౌత్ జోన్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించడం సామాన్యమైన విషయం కాదు. అఖిల్ పట్టుదల, కఠోర శ్రమకు ఈ పతకమే నిదర్శనం. భవిష్యత్తులో ఆయన మరిన్ని అంతర్జాతీయ పథకాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను,” అని ఆమె పేర్కొన్నారు. అఖిల్ సాధించిన ఈ గెలుపు జిల్లాలోని తోటి క్రీడాకారులకు గొప్ప స్ఫూర్తినిస్తూ, మహబూబాబాద్ క్రీడా ప్రతిష్ఠను మరింత పెంచిందని అధికారులు తెలిపారు.

Tags: