మైనర్లకు పొగాకు ఉత్పత్తులు విక్రయించడం నేరం
- పాఠశాలలు, కళాశాలల పరిసర ప్రాంతాల్లోని షాపులపై నిఘా
- ఎస్పీ డా. శబరీష్
విశ్వంభర, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల పరిసర ప్రాంతాల్లో ఉన్న షాపులపై జిల్లా పోలీసు అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. శబరీష్ ఆదేశాల మేరకు విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని మరియు మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టే ఉద్దేశంతో ఈ తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అధికారులు పాఠశాలలు, కళాశాలల సమీపంలోని కిరాణా షాపులు, టీ స్టాల్స్, పాన్ షాపులు మరియు ఇతర దుకాణాలను పరిశీలించారు. తనిఖీలలో భాగంగా విద్యార్థులకు హానికరమైన వస్తువుల విక్రయంపై ప్రత్యేక దృష్టి సారించారు. షాపు యజమానులకు సూచనలు చేస్తూ, సిఓటిపిఏ ఆక్ట్–2003 ప్రకారం సెక్షన్ 6(ఏ) ప్రకారం 18 సంవత్సరాల లోపు వయస్సు గల వారికి సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులు విక్రయించడం నేరమని తెలిపారు. అలాగే సెక్షన్ 6(బి) ప్రకారం పాఠశాలలు మరియు విద్యాసంస్థల నుండి 100 గజాల పరిధిలో పొగాకు ఉత్పత్తుల విక్రయం చేయడం చట్ట విరుద్ధమని, జేజే యాక్ట్ -2015 సెక్షన్ 77 ప్రకారం 7 సంవత్సరాల వరకు కఠిన జైలు శిక్ష మరియు ₹1,00,000 వరకు జరిమానా ఉంటుందని హెచ్చరించారు. అదేవిధంగా ఎన్ డి పి ఎస్ యాక్ట్–1985 ప్రకారం మాదకద్రవ్యాలు (డ్రగ్స్) విక్రయం, నిల్వ, రవాణా లేదా వినియోగం చేయడం తీవ్రమైన నేరమని తెలిపారు. అలాంటి కార్యకలాపాల్లో ఎవరైనా పాల్గొంటే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే షాపు యజమానులు తమ దుకాణాల వద్ద “18 సంవత్సరాల లోపు వారికి పొగాకు ఉత్పత్తుల విక్రయం చేయరాదు” అనే బోర్డులు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు. నిబంధనలు పాటించని దుకాణాలపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. శబరీష్ మాట్లాడుతూ, జిల్లాలో విద్యార్థులను మాదకద్రవ్యాలు మరియు ఇతర చెడు అలవాట్ల నుండి దూరంగా ఉంచడం పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని తెలిపారు. పాఠశాలలు మరియు కళాశాలల పరిసర ప్రాంతాల్లో డ్రగ్స్, పొగాకు ఉత్పత్తుల విక్రయం జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై ఎప్పటికప్పుడు దృష్టి పెట్టాలని, వారు ఎవరితో తిరుగుతున్నారు, ఎక్కడికి వెళుతున్నారు అనే విషయాలను గమనిస్తూ ఉండాలని సూచించారు. పిల్లలు చెడు అలవాట్లకు మరియు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు సమాజం కలిసి బాధ్యత తీసుకోవాలని ఎస్పీ పేర్కొన్నారు. జిల్లాలో విద్యార్థులకు సురక్షితమైన,ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించేందుకు ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని జిల్లా ఎస్పీ డా. శబరీష్ తెలిపారు.



