టీఎస్ ఐపాస్‌కు నీతి ఆయోగ్ ప్రశంసలు… తెలంగాణకు గర్వకారణం: కేటీఆర్
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: టీఎస్ ఐపాస్ విధానానికి నీతి ఆయోగ్ నుంచి లభించిన ప్రశంసలు తెలంగాణకు గర్వకారణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు.
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: టీఎస్ ఐపాస్ విధానానికి నీతి ఆయోగ్ నుంచి లభించిన ప్రశంసలు తెలంగాణకు గర్వకారణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో రూపుదిద్దుకున్న ఈ విధానం దేశంలోనే అత్యుత్తమ పరిశ్రమల అనుమతి వ్యవస్థగా నీతి ఆయోగ్ తన తాజా నివేదికలో గుర్తించడం, తెలంగాణ పారిశ్రామిక ప్రగతికి నిదర్శనమని ఆయన తెలిపారు. ఇది కేసీఆర్ దూరదృష్టికి, పాలనా నైపుణ్యానికి స్పష్టమైన గుర్తింపుగా నిలుస్తుందని అన్నారు.
ఎంతో పోరాటంతో సాధించుకున్న తెలంగాణను కేవలం పదేళ్ల వ్యవధిలోనే దేశానికి పారిశ్రామిక దిశానిర్దేశకంగా మార్చడంలో టీఎస్ ఐపాస్ కీలక పాత్ర పోషించిందని కేటీఆర్ గుర్తుచేశారు. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర ప్రభుత్వ సంస్థే అంగీకరించడం రాష్ట్రానికి గర్వకారణమని చెప్పారు.
పరిశ్రమల స్థాపనలో ఉండే అనవసర అడ్డంకులను తొలగించి, సింగిల్ విండో విధానంలో 15 నుంచి 30 రోజుల్లోనే అన్ని అనుమతులు ఇచ్చేలా టీఎస్ ఐపాస్‌ను రూపొందించామని ఆయన వివరించారు. అవినీతికి తావులేని పారదర్శక వ్యవస్థను పదేళ్లపాటు క్రమబద్ధంగా అమలు చేయడం వల్లే అద్భుతమైన ఫలితాలు సాధ్యమయ్యాయని అన్నారు.
ఈ విధానం ద్వారా భారీ పరిశ్రమలతో పాటు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల రంగంలో దాదాపు రూ.2.6 లక్షల కోట్ల పెట్టుబడులు తెలంగాణకు వచ్చాయని కేటీఆర్ తెలిపారు. దీని ద్వారా రాష్ట్రంలో 25 లక్షల మందికి పైగా యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు కల్పించగలిగామని చెప్పారు. ఇది దేశ పారిశ్రామిక చరిత్రలోనే ఒక విశిష్ట ఘట్టంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.
గతంలో రైతుబంధు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, టీ-హబ్ వంటి వినూత్న కార్యక్రమాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చినట్లే, ఇప్పుడు టీఎస్ ఐపాస్‌కూ అదే స్థాయి గుర్తింపు దక్కిందని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి సంస్థల నుంచి స్థానిక చిన్న పరిశ్రమల వరకు తెలంగాణను పెట్టుబడులకు అనుకూల గమ్యస్థానంగా చూడటానికి ఈ విధానం పెట్టుబడిదారుల్లో అపార విశ్వాసాన్ని నింపిందన్నారు.
కేసీఆర్ పాలనలో రూపొందిన తెలంగాణ మోడల్ ఆచరణీయమని నీతి ఆయోగ్ స్వయంగా పేర్కొన్న నేపథ్యంలో, దానిపై విమర్శలు చేయడం సరికాదని కేటీఆర్ హితవు పలికారు. “కేసీఆర్ గారి ఆనవాళ్లు చెరిపేస్తామనే భ్రమల్లో ఉన్న శక్తులు వాస్తవాన్ని గుర్తించి ఆలోచించాలి” అంటూ ప్రస్తుత ప్రభుత్వంపై పరోక్షంగా ఆయన విమర్శలు చేశారు. తెలంగాణ అభివృద్ధి ప్రయాణాన్ని నిరాకరించడం కాదు, దానిని కొనసాగించడమే రాష్ట్ర భవిష్యత్తుకు మేలని ఆయన సూచించారు.



