ప్రతి ఊరికో నర్సు ఉండాలి: మంత్రి దామోదర్ రాజనర్సింహ
నాగర్‌కర్నూల్‌లో రూ.కోట్లాది అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
"చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యం. ప్రతి గ్రామంలో కనీసం ఒకరైనా నర్సింగ్ చదివిన వారు ఉండాలన్నదే మా ఆకాంక్ష" అని రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పేర్కొన్నారు. సోమవారం నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో ఎంపీ మల్లు రవి, స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
విశ్వంభర, తెలంగాణ న్యూస్: "చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యం. ప్రతి గ్రామంలో కనీసం ఒకరైనా నర్సింగ్ చదివిన వారు ఉండాలన్నదే మా ఆకాంక్ష" అని రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పేర్కొన్నారు. సోమవారం నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో ఎంపీ మల్లు రవి, స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. మంత్రి పర్యటనలో భాగంగా సుమారు రూ. 40 కోట్లపైగా విలువైన పనులకు శ్రీకారం చుట్టారు. కేసరి సముద్రం చెరువు కట్ట వద్ద రూ. 10 కోట్లతో బ్రిడ్జి నిర్మాణం, రూ.9 కోట్లతో ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనం, రూ.1.05 కోట్లతో అదనపు తరగతి గదుల ప్రారంభం, రూ. 10 కోట్లతో సీసీ రోడ్లు, రూ. 10 కోట్లతో డ్రైనేజీ వ్యవస్థ, రూ. 3.14 కోట్లతో కేసరి సముద్రం ఆధునీకరణ పనులకు శ్రీకారం చుట్టారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యం అదే..
విద్యా, వైద్య రంగాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని మంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 109 ట్రామా కేంద్రాలు, వృద్ధుల కోసం 37 ప్రణామ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, రూ.200 కోట్లతో 105 ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను నిర్మిస్తున్నామన్నారు. నర్సింగ్ వృత్తికి అంతర్జాతీయంగా, ముఖ్యంగా జపాన్ వంటి దేశాల్లో గొప్ప ఆదరణ ఉందని, విద్యార్థులు ఈ రంగంలో రాణించాలని మంత్రి సూచించారు.
వడ్డీ లేని రుణాల చెక్కుల పంపిణీ
ఈ సందర్భంగా పట్టణంలోని 245 మహిళా సంఘాలకు రూ. 7.80 కోట్ల వడ్డీ లేని రుణాల చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. జిల్లాలో ఇప్పటివరకు 27 లక్షల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకున్నారని ఎంపీ మల్లు రవి వెల్లడించారు.
విద్యార్థులతో ముఖాముఖి..
ఇందులో భాగంగా మంత్రి దామోదర రాజనర్సింహ విద్యార్థులతో నేరుగా మాట్లాడారు. ఐఏఎస్, డాక్టర్లు, ఆర్మీ వంటి రంగాల్లో రాణించాలనుకుంటున్న విద్యార్థులకు క్రమశిక్షణ, నిరంతర శ్రమతోనే విజయం సాధ్యమని దిశానిర్దేశం చేశారు. ఆయన వెంట ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, రాజేష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.



