ఎయిడ్స్ నివారణ పై సమీక్షా సమావేశం
విశ్వంభర, మహబూబాబాద్: జిల్లాలో ఎయిడ్స్ నివారణ, చికిత్స, అవగాహన కార్యక్రమాల పురోగతిపై బుధవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. రవి రాథోడ్ కలెక్టరేట్ లోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలో హెచ్ఐవి పరీక్షలు, ఏఆర్టీ సెంటర్ల సేవలు, గర్భిణీలకు హెచ్ఐవీ స్క్రీనింగ్, హెచ్ఐవి వ్యాప్తిని నివారించడానికి తీసుకుంటున్న చర్యలపై సమగ్రంగా చర్చించారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ బి. రవి రాథోడ్ మాట్లాడుతూ, హెచ్ఐవి నివారణలో అవగాహన ఎంతో ముఖ్యమని, ప్రతి ఒక్కరూ సురక్షిత జీవన విధానాలను పాటించాల్సిన అవసరం ఉందని తెలిపారు. గర్భిణీలకు తప్పనిసరిగా హెచ్ఐవి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి తక్షణ చికిత్స అందించాలని అధికారులకు ఆదేశించారు. లింక్ వర్కర్స్, సర్వోదయ స్వచ్ఛంద సంస్థ, కోఆర్డినేటర్స్, సమన్వయంతో పనిచేసి హెచ్ఐవి కేసుల గుర్తింపు, చికిత్సలో శ్రద్ధ వహించాలని సూచించారు. అలాగే, యువతలో అవగాహన కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించాలని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ అర్జున్, క్లస్టర్ ప్రోగ్రాం మేనేజర్ జ్యోతి, జిల్లా డిప్యూటీ మాస్ మీడియా అధికారి కె ప్రసాద్, హెల్త్ ఎడ్యుకేటర్ కె.వి.రాజు, నీలీమా శ్వేత,ఆశోక్, సారంగం సిఎస్ఓ, సబ్ యూనిట్ ఆఫీసర్ శ్రీనివాస్ , కౌన్సిలర్స్ పాల్గొన్నారు.



