డిపో పనులు తక్షణం ప్రారంభించాలి:
- కేంద్ర మంత్రికి బీఆర్ఎస్ విజ్ఞప్తి
విశ్వంభర,మహబూబాబాద్: మహబూబాబాద్‌లో మంజూరైన మెగా ఫ్రైట్ మెయింటెనెన్స్ డిపో పనులను వెంటనే ప్రారంభించాలని బీఆర్ఎస్ నేతలు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ను కోరారు. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర, సభ్యులు కే.ఆర్. సురేష్ రెడ్డి, దామోదర్ రావు, డాక్టర్ బండి పార్థసారథి రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కలిసి పార్లమెంట్‌లో వినతిపత్రం అందజేశారు. వరంగల్–మహబూబాబాద్ సెక్షన్‌కు సంబంధించిన ఈ ప్రాజెక్ట్‌కు రూ. 908.15 కోట్లతో ఇప్పటికే అనుమతి లభించినప్పటికీ, భూమి కేటాయింపు పూర్తయ్యాక కూడా పనులు ప్రారంభం కాలేదని వారు తెలిపారు. మహబూబాబాద్ జిల్లా అనంతారంలో 409 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులో ఉంచిందని పేర్కొన్నారు. ఈ డిపో నిర్మాణం ఆలస్యమవడంతో ప్రాంతీయ అభివృద్ధి, ఉపాధి అవకాశాలు దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తూ, తక్షణమే పరిపాలనా అనుమతులు ఇచ్చి పనులు ప్రారంభించాలని మంత్రిని కోరారు.



