సినిమా టికెట్ల పెంపుపై హైకోర్టు సీరియస్

సినిమా టికెట్ల పెంపుపై హైకోర్టు సీరియస్

 రాష్ట్రంలో సినిమా టికెట్ ధరల ఇష్టారాజ్యపు పెంపుపై తెలంగాణ హైకోర్టు మరోసారి సీరియస్ అయ్యింది. 

విశ్వంభర, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో సినిమా టికెట్ ధరల ఇష్టారాజ్యపు పెంపుపై తెలంగాణ హైకోర్టు మరోసారి సీరియస్ అయ్యింది. కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ టికెట్ రేట్లు పెంచడంపై ప్రభుత్వంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. "మీకెన్నిసార్లు చెప్పాలి?" అంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తూ, రాష్ట్ర హోంశాఖ సెక్రటరీ సీవీ ఆనంద్‌కు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. గతంలో 'పుష్ప-2' సమయంలోనే టికెట్ ధరలు పెంచవద్దని కోర్టు ఆదేశించినా, సంక్రాంతికి విడుదలైన 'రాజాసాబ్' సినిమాకు భారీగా రేట్లు పెంచడంపై న్యాయస్థానం మండిపడింది.

అనిల్ రావిపూడి - మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్‌లో వచ్చిన 'మనశంకర వరప్రసాద్' సినిమాకు కూడా టికెట్ ధరలు పెంచారని, ఈ విషయాన్ని ప్రభుత్వం కోర్టు దృష్టికి తీసుకురాలేదని పిటిషనర్ ఫిర్యాదు చేశారు. ఇకపై ఏ సినిమా టికెట్ రేట్ల పెంపు పైనైనా కనీసం 90 రోజుల ముందే నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. న్యాయస్థానం ఆదేశాలను ఖాతరు చేయకపోవడంపై వివరణ ఇవ్వాలి. సినిమా విడుదల సమయంలో హడావిడిగా రేట్లు పెంచే సంస్కృతికి చెక్ పెట్టాల్సిందే అని హైకోర్టు ధర్మాసనం వెల్లడించింది.

Read More చేనేత ఐక్యవేదిక ఆర్గనైజింగ్ సెక్రటరీ గా సిరిమల్ల పద్మ నియామకం 

అసలేం జరిగింది?
గత కొంతకాలంగా పెద్ద సినిమాల విడుదల సమయంలో నిర్మాతలు ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతులు పొంది టికెట్ ధరలను భారీగా పెంచుతున్నారు. దీనివల్ల సామాన్య ప్రేక్షకులపై భారం పడుతోందంటూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన కోర్టు.. ఈ పద్ధతిని తప్పుపట్టింది. పెంపు నిర్ణయం తీసుకునే ముందు ముందస్తు సమాచారం, పారదర్శకత ఉండాలని పేర్కొంది. ఈ వ్యవహారంపై తదుపరి విచారణలో హోం సెక్రటరీ ఇచ్చే వివరణ ఆధారంగా కోర్టు తదుపరి చర్యలు తీసుకోనుంది.