ఖమ్మంలో కాంగ్రెస్ ‘రాక్షస కాండ’.. కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీశ్ రావు విమర్శలు

ఖమ్మంలో కాంగ్రెస్ ‘రాక్షస కాండ’.. కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీశ్ రావు విమర్శలు

 ఖమ్మం నగరం వెలుగుమట్ల వినోబా నగర్‌లో పేదల ఇళ్లను కూల్చివేయడాన్ని మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు.

విశ్వంభర, తెలంగాణ బ్యూరో: ఖమ్మం నగరం వెలుగుమట్ల వినోబా నగర్‌లో పేదల ఇళ్లను కూల్చివేయడాన్ని మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు. వేల మంది పోలీసుల పహారాలో, నాలుగు జిల్లాల బలగాలను మోహరించి ఒక యుద్ధ వాతావరణాన్ని సృష్టించి ఇళ్లను కూల్చాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించారు. అప్పులు చేసి పేదలు నిర్మించుకున్న ఇళ్లను కూల్చడం అత్యంత హేయమైన చర్య అని, పేద ప్రజలు ప్రభుత్వానికి తీవ్రవాదుల్లా కనిపిస్తున్నారా అని  నిలదీశారు. పోలీసులను అడ్డం పెట్టుకుని మీడియాను రాకుండా అడ్డుకుంటున్నారంటేనే ప్రభుత్వం చేస్తున్న అరాచకం బయటకు తెలియకూడదనే భయం కనిపిస్తోందని హరీశ్ రావు విమర్శించారు. "చీకటి పనులు చేసేవారే మీడియాను చూసి భయపడతారు" అంటూ ఎద్దేవా చేశారు. అధికారంలోకి వస్తే ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని నమ్మబలికిన రేవంత్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు.. నేడు ఉన్న ఇళ్లను కూలగొట్టి పేదలను నడిరోడ్డుపై నిలబెట్టడం దుర్మార్గమని ధ్వజమెత్తారు.

గుండె తరుక్కుపోతున్న బాధితుల రోదన
ఓటు వేసినందుకు మాకు తగిన శాస్తి జరిగింది అని బాధితులు రోదిస్తుంటే చూసి గుండె తరుక్కుపోతోందని హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో కష్టపడి కట్టుకున్న ఇళ్లను ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, ప్రత్యామ్నాయం చూపకుండా కూల్చడం అమానుషమని పేర్కొన్నారు. బాధితుల కన్నీళ్లకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

Read More మంత్రుల వ్యక్తిగత జీవితాల దుష్ప్రచారంపై టీపీసీసీ చీఫ్ అసహనం

బీఆర్ఎస్ అండగా ఉంటుంది
వెంటనే అక్రమ కూల్చివేతలను ఆపి పోలీసులు వెనక్కి వెళ్లాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ వారికి అండగా ఉంటుందని స్పష్టం చేశారు. పేదలపై కర్రలు ఎత్తడం మానేసి, ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై దృష్టి పెట్టాలని సూచించారు. నిర్వాసితులకు న్యాయం చేయకుండా ఇంచు భూమి కూడా కదిలించడానికి వీల్లేదు అని స్పష్టం చేస్తూ, పేదల గూడు చెదిరితే ప్రభుత్వ గద్దెలు కూడా అంతే వేగంగా కూలుతాయని హెచ్చరించారు.