నందిగామలో వైభవంగా శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణం
- పాల్గొన్న మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి

విశ్వంభర, పటాన్‌చెరు: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం నందిగామ గ్రామంలో మహా చండీ సహిత శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. గ్రామ సర్పంచ్ ఎల్లగోని విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆధ్యాత్మిక వేడుకకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.ఈ వేడుకకు రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, గనులు మరియు భూగర్భ శాస్త్ర శాఖ మంత్రి శ్రీ గడ్డం వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వారితో పాటు పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి కాట శ్రీనివాస్ గౌడ్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధా దంపతులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వీరికి పూర్ణకుంభంతో స్వాగతం పలికి, ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు.ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తులకు మానసిక ప్రశాంతతను అందించడమే కాకుండా, సమాజంలో మానవతా విలువలు పెంపొందించేందుకు దోహదపడతాయని కొనియాడారు. ఆలయాల అభివృద్ధికి, భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.ఈ కళ్యాణ మహోత్సవంలో వివిధ గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు. భక్తుల రాకతో నందిగామ గ్రామం ఆధ్యాత్మిక శోభతో సంతరించుకుంది.



