పదో తరగతి పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు 

  • మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్

విశ్వంభర, మహబూబాబాద్:  పదో తరగతి పరీక్షలు నిర్వహణపై విద్యాశాఖ ఆధ్వర్యంలో రెవెన్యూ, పోలీస్, వైద్య, సమాచార, పంచాయతి రాజ్, రవాణా, విద్యుత్తు, ఆర్టీసీ, ట్రెజరి, పోస్టల్,  మున్సిపల్ అధికారులతో సోమవారం ఐడిఓసి కాన్ఫరెన్స్ హాలులో జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ సమన్వయ సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ  మార్చిలో  పరీక్షలు నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వ పరీక్షల నియంత్రణాధికారి  జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం ఎస్‌ఎస్‌సి పబ్లిక్ పరీక్షలు మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు ఉదయం 9.30 నుండి 12.30 గంటల వరకు జరుగనున్నాయని తెలిపారు. పరీక్షల నిర్వహణలో ఎటువంటి అంతరాయం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని స్పష్టం చేశారు. పరీక్షలు ప్రశాంతంగా, పారదర్శకంగా, టువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా నిర్వహించేందుకు అవసరమైన భద్రతా చర్యలు, రవాణా సౌకర్యాలు, వైద్య సదుపాయాలు, విద్యుత్ సరఫరా, ప్రశ్నాపత్రాల రవాణా, భద్రత తదితర అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. పోలీస్ బందోబస్తు మధ్య ప్రశ్న, జవాబు పత్రాలు తరలించాలని సూచించారు. జిల్లాలో 45 కేంద్రాల్లో  8157  మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు అవుతున్నట్లు తెలిపారు.  పర్యవేక్షణకు ఫ్లైయింగ్ స్కాడ్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల సమీపంలో జిరాక్స్ కేంద్రాలు మూసి వేయాలని,144 సెక్షన్ అమలు చేయాలని తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో అత్యవసర సేవలకు వైద్య కేంద్రాలు, అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలని,  108 వాహనాలు, ప్రధాన ఆసుపత్రిలో అత్యవసర వార్డులు సిద్ధంగా ఉంచాలని సూచించారు.  విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవడానికి అనువుగా అదనపు బస్సులు నడపాలని తెలిపారు. అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని సూచించారు.  పరీక్షా కేంద్రాల్లో పారిశుద్య కార్యక్రమాలు నిర్వహించి పరిశుభ్రం చేయాలని పంచాయతి, మున్సిపల్ అధికారులను ఆదేశించారు.  ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) లెనిన్ వత్సల్ టోప్పో,మహబూబాబాద్, తొర్రూరు రెవెన్యూ డివిజనల్ అధికారులు క్రిష్ణవేణి, గణేష్, డీఈవో రాజేశ్వర్, డీఎస్పీ తిరుపతిరావు, మున్సిపల్  కమిషనర్లు, విద్యుత్, ఆర్టీసీ, పోస్టల్ తదితర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Tags: