మహిళల సాధికారతకు విద్యే ఆయుధం
విశ్వంభర, హైదరాబాదు : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్క రించుకొని తెలంగాణ మహిళా ఉపాధ్యాయ సమాఖ్య ఆధ్వర్యంలో “తెలంగాణ విద్యా కమిషన్ – మహిళా విద్య” అనే అంశంపై చర్చా కార్యక్రమం హైదరాబాదు బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మల్లీశ్వరి అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ప్రొఫెసర్ హరగోపాల్ వాల్ పోస్టర్లను ఆవిష్కరించి ఆయన మాట్లాడుతూ మహిళల సాధికారతకు విద్యే ప్రధాన ఆయుధమని పేర్కొన్నారు. తెలంగాణ విద్యా కమిషన్ నివేదికలో మహిళలు, బాలికల విద్యకు సంబంధించిన ప్రత్యేక సూచనలు లేకపోవడం దురదృష్టకరమన్నారు. రాష్ట్రంలో అక్షరాస్యతలో పురుషులు 87 శాతం ఉండగా మహిళలు 74 శాతం మాత్రమే ఉండటం సమాజంలో ఉన్న అసమానతను చూపుతోందని తెలిపారు. మహిళలు సమాన అవకాశాలతో ముందుకు రావాలంటే వైద్య, సాంకేతిక, వృత్తి విద్యలలో ప్రత్యేక సీట్ల కేటాయింపు అవసరమని సూచించారు. మహిళా క్రీడాకారిణులు అంతర్జాతీయ స్థాయిలో విజయం సాధించినప్పుడు ప్రభుత్వం బహుమతులు అందిస్తున్నప్పటికీ, మహిళలకు ప్రత్యేక క్రీడా పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటు చేయాలనే దిశగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. విద్యా రంగంలో మహిళల ప్రాతినిధ్యం 53 శాతం వరకు ఉన్నప్పటికీ అందులో గణనీయమైన భాగం ప్రైవేటు విద్యాసంస్థలలో తక్కువ వేతనాలతో పనిచేస్తున్నారని తెలిపారు. మహిళా ఉపాధ్యాయుల మేధోశ్రమ దోపిడీపై కమిషన్ దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం డాక్టర్ వనమాల మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో సమాన అవకాశాలతో ముందుకు రావాలంటే విద్యా వ్యవస్థలో లింగ సమానత్వం ప్రతిబింబించే విధానాలు అవసరమన్నారు. సీనియర్ జర్నలిస్టు సజయ మాట్లాడుతూ మహిళల విద్యాభివృద్ధి సమాజ అభివృద్ధికి పునాది అని, విద్యా రంగంలో మహిళలకు సముచిత అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. సామాజికవేత్త అంబిక మాట్లాడుతూ బాలికల విద్యను ప్రోత్సహించేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ఈ సందర్భంగా “తెలంగాణ విద్యా కమిషన్‌లో మహిళల విద్య చోటు ఎక్కడుంది?” అనే పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి స్వరూపారాణి, శాంతా, రామలక్ష్మి, శివరాజ్యలక్ష్మి, రేణుక, పద్మావతి, వాణిశ్రీ, అనురాధ, అర్చన, లక్ష్మి, ఐలేశ్వరి, శైలజ, కిరణ్ కుమారి, శారద తదితరులు పాల్గొన్నారు.



