క్రీడలు, వ్యాయామంతో ఆరోగ్యం
విశ్వంభర, బాగ్ లింగంపల్లి : రాజ్యసభ సభ్యుడు ఎంపీ ల్యాండ్స్ నిధులతో ఏర్పాటు చేసిన షటిల్ కోర్టును ఆదివారం ప్రారంభించారు. షటిల్ ఆట ఆడడం వల్ల ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమని రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. హైదరాబాదు బాగ్ లింగంపల్లి సుందరయ్య పార్కులో కొత్తగా ఏర్పాటు చేసిన షటిల్ కోర్టును వాకర్స్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ షటిల్ వంటి ఆటలు శారీరక దృఢత్వాన్ని పెంపొందించడంలో సహాయపడతాయని అన్నారు. ఈ ఆట ద్వారా శరీరానికి వ్యాయామం లభించి రక్తప్రసరణ మెరుగుపడటంతో పాటు కండరాల బలం కూడా పెరుగుతుందని తెలిపారు. యువతతో పాటు మధ్య వయసు, వృద్ధులు కూడా ఇలాంటి క్రీడల్లో పాల్గొంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. ముఠా గోపాల్ మాట్లాడుతూ నిరంతరం వ్యాయామం చేయడం, క్రీడల్లో పాల్గొనడం వల్ల ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతత కలుగుతుందని చెప్పారు. శరీర దారుఢ్యంతో పాటు హృదయ ఆరోగ్యం, కీళ్ల బలం కూడా మెరుగుపడుతుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ రోజువారీ జీవితంలో వ్యాయామం, క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాదు సెంట్రల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి, జయసింహ, కళ్యాణ్ నాయక్, నవీన్ నాయక్, నాగభూషణ్, శ్రీనివాస్ రెడ్డి, అంజి యాదవ్, నిరంజన్ రెడ్డి, నిమ్మ రాజశేఖర్, మాజీ కార్పొరేటర్ కల్పన యాదవ్, దామోదర్ రెడ్డి, ప్రభాకర్, లోకేష్ యాదవ్, వివేక్ ఆనంద్, మురళి కృష్ణ , నరసింహ తదితరులు పాల్గొన్నారు.



