ప్రతిక్షణం స్త్రీని గౌరవించాలి
- జస్టిస్ రాధారాణి
విశ్వంభర, బషీర్ బాగ్: స్త్రీ గొప్పతనాన్ని తన త్యాగాన్ని ఒక్కరోజుకే పరిమితం కాకుండా ప్రతిక్షణం స్త్రీని గౌరవించాల్సిన అవసరం ఉందని జస్టిస్ రాధారాణి అన్నారు. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అధికారుల, ఉద్యోగుల సంఘాల ఆధ్వర్యంలో కింగ్ కోఠి లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకల్లో ముఖ్యఅతిథిగా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రాధారాణి పాల్గొని ప్రసంగించారు. స్త్రీని ఇంట్లో ఉండే ఒక ఆట వస్తువుగా కాకుండా తనకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు బాధ్యత ఇవ్వాలని కోరారు. తల్లిదండ్రులు అమ్మాయి వేసే ప్రతి అడుగులో నీడగా ఉండి తనకి తోడుగా ఉండి తను చేసే ప్రతి పనిలో తనని ప్రోత్సహిస్తే శిఖరాలను దాటే ఒక వజ్రం అవుతుందన్నారు. అబ్బాయిలకి సమానంగా అమ్మాయిని పెంచాలన్నారు. ఆడపిల్ల పుట్టగానే భయంతో కాకుండా ధైర్యంగా పెంచాలని కోరారు. ఆడపిల్ల పుట్టింది అని చులకన భావంతో కాకుండా పుట్టింది నాకు ఆడపిల్ల అని గర్వపడ్డ రోజే నిజమైన మహిళా దినోత్సవమన్నారు. ఈ బ్యాంకులలో పని చేసే మహిళా ఉద్యోగులు గ్రామీణ ప్రాంతాలొనే పని చేస్తున్నారని వారికి అనేక సమస్యలు ఉన్నాయని వాటిని ఈ మొదటి సమావేశంలో సుదీర్ఘంగా చర్చించి పరిష్కరం చూపుతామని సంఘాల నాయకులు వెల్లడించారు. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, వెంకటరామయ్య వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు క్రాంతి కుమార్, ప్రధాన కార్యదర్శి అశోక్, ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు వేణు రావు, ప్రధాన కార్యదర్శి ఏ బాపు, సీసీ మెంబర్స్ బిక్షమయ్య, భూపాల్ తదితరులు పాల్గొన్నారు.



