చట్టసభల్లో బిసిలకు 50శాతం రిజర్వేషన్లే లక్ష్యం

చట్టసభల్లో బిసిలకు 50శాతం రిజర్వేషన్లే లక్ష్యం

  •  జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు  ఆర్. కృష్ణయ్య

విశ్వంభర, హైదరాబాదు : దేశంలో బి.సి.ల జనాభా భారీగా ఉన్నప్పటికీ రాజకీయ అధికారంలో తగిన ప్రాతినిధ్యం లభించడం లేదు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బి.సి.లకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిందే నని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య అన్నారు. ఈ మేరకు మార్చి 30, 31 తేదీలలో ఢిల్లీలో జాతీయ సెమినార్ నిర్వహిస్తూ “ఛలో ఢిల్లీ” కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. హైదరాబాదు బషీర్‌బాగ్‌లో బి.సి. సంక్షేమ సంఘం నేతలు బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజేందర్,బిసి ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు అనంతయ్యల అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. బి.సి.లకు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా చర్చలను ప్రారంభిస్తున్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్ర రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు ఈ సెమినార్‌లో పెద్ద ఎత్తున పాల్గొంటారని తెలిపారు. ప్రొఫెసర్లు, మేధావులు, కేంద్ర మంత్రులు, వివిధ పార్టీలకు చెందిన పార్లమెంట్ సభ్యులు కూడా పాల్గొనే అవకాశం ఉందన్నారు. దేశ చరిత్రలో తొలిసారిగా కేంద్ర ప్రభుత్వం జనగణనలో కులగణన చేపట్టడం కీలక ముందడుగని పేర్కొన్నారు. 1931 తర్వాత ఇలాంటి ప్రక్రియ చేపట్టడం చారిత్రాత్మకమని చెప్పారు. కులగణన అనంతరం బి.సి.లకు జనాభా ప్రాతిపదికన ఆర్థిక, రాజకీయ, సామాజిక, విద్యా, ఉద్యోగ రంగాల్లో తగిన వాటా లభించే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. దీంతో సమాజంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటాయని తెలిపారు. బి.సి.ల వర్గీకరణ కోసం జస్టిస్ రోహిణి కమిటీని ఏర్పాటు చేయడం కూడా కీలక చర్య అని చెప్పారు. ఆ కమిటీ నివేదిక ఆధారంగా సంక్షేమ పథకాల రూపకల్పన, అవసరమైన బడ్జెట్ కేటాయింపులు, కార్యాచరణ ప్రణాళిక అమలులో స్పష్టత వస్తుందని పేర్కొన్నారు. స్థానిక సంస్థల్లో బి.సి. రిజర్వేషన్ల పెంపుకు కూడా ఇది దోహదపడుతుందని వివరించారు. బి.సి. సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ సత్యం మాట్లాడుతూ బి.సి.ల హక్కుల సాధన కోసం దేశవ్యాప్తంగా ఐక్యంగా పోరాటం అవసరమని అన్నారు. చట్టసభల్లో తగిన ప్రాతినిధ్యం లభించినప్పుడే బి.సి.ల సమస్యలకు సమగ్ర పరిష్కారం దొరుకుతుందని పేర్కొన్నారు. ఢిల్లీలో నిర్వహించే జాతీయ సెమినార్ ద్వారా బి.సి.ల డిమాండ్లను దేశవ్యాప్తంగా బలంగా వినిపించే ప్రయత్నం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో సతీష్,శివ, నిఖిల్ , తదితరులు పాల్గొన్నారు.

Tags: