ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ దాడులు ఆపాలి
విశ్వంభర, హిమాయత్‌నగర్ : ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ దాడులను తక్షణమే ఆపి ప్రపంచ శాంతిని కాపాడాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) తెలంగాణ రాష్ట్ర సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు హైదరాబాదు హిమాయత్‌నగర్ వై జంక్షన్ కూడలి వద్ద ప్లకార్డులు చేతబూని నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వలి ఉల్లా ఖాద్రీ, రాష్ట్ర కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర మాట్లాడుతూ యుద్ధం ద్వారా సమస్యలను పరిష్కరించడం అంతర్జాతీయ శాంతికి ముప్పు అని పేర్కొన్నారు. మధ్యప్రాచ్య ప్రాంతంలో యుద్ధ వాతావరణం సృష్టించడం వల్ల సాధారణ ప్రజలే తీవ్ర నష్టాలను ఎదుర్కొంటారని తెలిపారు. సమస్యల పరిష్కారానికి యుద్ధం కాకుండా సంభాషణలు, రాజదౌత్య మార్గాలు అవలంబించాలని సూచించారు. అమెరికా సామ్రాజ్యవాద విధానాలను ప్రపంచ ప్రజలు ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ వివాదాలను శాంతియుత మార్గాల్లో పరిష్కరించేందుకు అన్ని దేశాలు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నెర్లకంటి శ్రీకాంత్, తీర్పారి వెంకటేశ్వర్లు, కూనుకుంట్ల శంకర్, చేపూరి కొండల్, మెస్రం భాస్కర్, మహమూద్ తదితరులు పాల్గొన్నారు.



