పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలి
విశ్వంభర, హైదరాబాదు : ఇండ్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని కోరుతూ సోమవారం సీపీఐ(ఎం) రంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన ‘చలో సీఎం క్యాంప్ ఆఫీస్’ పాదయాత్రను పోలీసులు అడ్డుకోవడాన్ని సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ ఖండించింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీతో పాటు నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేసి ఎల్‌బీ నగర్, అబ్దుల్లాపూర్‌మెంట్, నాగోలు, వనస్థలీపురం పోలీస్ స్టేషన్లలో నిర్బంధించడాన్ని వ్యతిరేకించింది. అరెస్టయిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా జాన్ వెస్లీ మాట్లాడుతూ నిరుపేదలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూములను పేదల ఇళ్ల నిర్మాణానికి కేటాయించకుండా కార్పొరేట్ సంస్థలకు ఇవ్వాలని చూడడం సరికాదన్నారు. పేదల ఇండ్లు కూల్చడం, వారిని నిరాశ్రయులను చేయడం వంటి చర్యలను తక్షణమే నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. పేదలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు పంపిణీ చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అరెస్టయిన వారిలో భూపాల్, పగడాల యాదయ్య, డి రామచందర్, ఎం చంద్రమోహన్, కవిత, ఇ నర్సింహ, జగదీష్, కిషన్ తదితరులు ఉన్నారు. అక్రమ అరెస్టులను ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని పిలుపునిచ్చారు.



