నిధులు కేటాయించి రైతాంగాన్ని ఆదుకోవాలి 

నిధులు కేటాయించి రైతాంగాన్ని ఆదుకోవాలి 

  • సీపీఐ మండల కార్యదర్శి బండారు శివ 

విశ్వంభర, ఆత్మకూరు: ఏపి రైతు సంఘము, రాష్ట సమితి పిలుపు మేరకు ఆత్మకూరుమండల తహశీల్దార్ కార్యాలయము దగ్గర నిరసన కార్యక్రమం నిర్వహించారు. తదనంతరము డిప్యూటీ తహశీల్దార్ బాలమ్మకు  వినతిపత్రము అందించారు. సీపీఐ మండల కార్యదర్శి బండారు శివ  మాట్లాడుతూ  ''ఏపీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఫిబ్రవరి 14న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ రైతులను, కౌలు రైతులను తీవ్ర నిరాశకు గురిచేసింది. మొత్తం రూ ॥3.33 లక్షల కోట్ల బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి కేవలం 4.3 శాతం మాత్రమే కేటాయించడం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే విధంగా ఉంది. 'అన్నదాత సుఖీభవ' పథకానికి గతంలో రూ.॥ 9,400 కోట్లు ఉండగా..  ప్రస్తుతం రూ.॥ 6,660 కోట్లకు తగ్గించారు. రాష్ట్రంలో మెజారిటీ భూములు సాగు చేస్తున్న కౌలు రైతుల ప్రస్తావనే ఈ బడ్జెట్లో లేకపోవడం గమనార్హం. వడ్డీ రాయితీకి రూ.॥2,000 కోట్లు అవసరమైతే కేవలం రూ.॥ 250 కోట్లు...  ధరల స్థిరీకరణ నిధికి రూ.॥3,000 కోట్లు అవసరమైతే కేవలం రూ.॥ 500 కోట్లు మాత్రమే కేటాయించారు.  ఉచిత పంటల బీమాను ఎత్తివేయడం, ప్రకృతి విపత్తుల సహాయ నిధికి నిధులు సున్నాగా ఉండటంవల్ల రైతులు అభద్రతకు గురవుతున్నారు. పశుసంవర్ధక, మత్స్య, ఆక్వా, సెరికల్చర్ వంటి ఉపాధినిచ్చే రంగాలకు ఆశించిన ప్రాధాన్యత లభించలేదు. రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయం, అనుబంధ రంగాలకు కనీసం 10 శాతం నిధులను కేటాయించాలి. గత, ప్రస్తుత సంవత్సర బకాయిల కింద సుమారు రూ.॥ 27,500 కోట్లు తక్షణమే విడుదల చేయాలి.  భూమి లేని కౌలు రైతులకు రావాల్సిన సుమారు రూ.॥3,500 కోట్ల బకాయిలను వెంటనే వారి ఖాతాల్లో జమ చేయాలి. ఎన్నికల వాగ్దానం మేరకు నూతన కౌలు చట్టాన్ని తీసుకురావాలి. ధరల స్థిరీకరణకు రూ.॥3,000 కోట్లు, వడ్డీ రాయితీకి రూ.॥2,000 కోట్లు, ఉచిత పంటల  బీమాకు రూ.|| 2,000 కోట్లు కేటాయించాలి. మైనర్ ఇరిగేషన్ పనులకు కనీసం రూ.॥ 5,000 కోట్లు కేటాయించాలి. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలి. నిర్వాసితుల సమస్యలు పరిష్కరించేందుకు నిధులు కేటాయించాలి. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు తక్షణమే ఎక్స్ గ్రేషియా చెల్లించి వారిని ఆదుకోవాలి. కేంద్ర బడ్జెట్లో వ్యవసాయరంగానికి నిధులు పెంచేలా ఒత్తిడి తేవాలి.'' అని  సీపీఐ మండల కార్యదర్శి బండారు శివ కోరారు.  కార్యక్రమంలో  గోపాల్ నాయక్, నాగరాజు నాయక్, నల్లమ్మ, లలితమ్మ, ఓబులేసు, తెలిసే నాయక్, కిషోర్ నాయక్, వెంకటేష్ నాయక్, రైతులు, కౌలురైతులు పాల్గొన్నారు.

Tags: