అంబేద్కర్ స్మారక భవన్‌గా ప్రకటించాలి 

అంబేద్కర్ స్మారక భవన్‌గా ప్రకటించాలి 

  •  మాల సంక్షేమ సంఘం

విశ్వంభర, బషీర్ బాగ్: కాచిగూడలోని నింబోలి అడ్డ హాస్టల్‌ను బాబు జగ్జీవన్ రాం స్మారక భవన్‌గా మార్చే ప్రయత్నాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు మాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల రాంప్రసాద్ తెలిపారు. ఈ హాస్టల్‌కు బీఆర్ అంబేద్కర్ చారిత్రక సంబంధం ఉందని , దానిని అంబేద్కర్ స్మారక భవన్‌గా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆదివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో మాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నింబోలి అడ్డ హాస్టల్ నిజాం కాలంలో షెడ్యూల్డ్ కాస్ట్ ట్రస్ట్ ఫండ్ ఆధ్వర్యంలో నడిచిందని స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఆ చారిత్రక నేపథ్యాన్ని విస్మరించి వేరే పేరుతో మార్చడం అంబేద్కర్ చరిత్రను అవమానించడమేనని అన్నారు. అలాగే మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్ని వర్గాలకు మంత్రి అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని, ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం సరైంది కాదని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశంపై స్పందించి సరైన నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు.బాబు జగ్జీవన్ రామ్ స్మారక భవన్‌ను వేరే ప్రాంతంలో ఏర్పాటు చేయడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ కాచిగూడ నింబోలి అడ్డ హాస్టల్‌కు ఆ పేరు పెట్టడాన్ని మాత్రం సహించబోమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ చైతన్య, సల్ల నర్సింగరావు, గుణక ప్రసాద్, తలారి శ్రీనివాస్, అంజలిదేవి సుద్దమల్ల, ఆర్ శ్రీనివాస్, భాను ప్రసాద్, శంకరయ్య, అరుణ్ కుమార్, సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Tags: