ఇరాన్‌ను తక్షణమే వీడాలని భారతీయులకు ఎంబసీ ఆదేశం

అగ్రరాజ్యం అమెరికా ఇరాన్‌పై దాడి చేసే అవకాశం ఉందన్న అంచనాలతో ఉద్రిక్తత

ఇరాన్‌ను తక్షణమే వీడాలని భారతీయులకు ఎంబసీ ఆదేశం

పశ్చిమాసియాలో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇరాన్‌లో నివసిస్తున్న భారత పౌరుల భద్రతపై ఆందోళన నెలకొంది. ఏ క్షణమైనా అమెరికా దాడులు చేసే అవకాశం ఉందన్న వార్తలు, దేశవ్యాప్తంగా సాగుతున్న విద్యార్థుల ఆందోళనలతో ఇరాన్ గందరగోళంగా మారింది.

విశ్వంభర, నేషనల్ బ్యూరో: పశ్చిమాసియాలో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇరాన్‌లో నివసిస్తున్న భారత పౌరుల భద్రతపై ఆందోళన నెలకొంది. ఏ క్షణమైనా అమెరికా దాడులు చేసే అవకాశం ఉందన్న వార్తలు, దేశవ్యాప్తంగా సాగుతున్న విద్యార్థుల ఆందోళనలతో ఇరాన్ గందరగోళంగా మారింది. ఈ పరిస్థితులను గమనించిన టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం అత్యవసర అడ్వైజరీని జారీ చేసింది. జనవరి 5న ఇచ్చిన మార్గదర్శకాలకు కొనసాగింపుగా, ప్రస్తుతం ఇరాన్‌లో ఉన్న భారతీయ విద్యార్థులు, యాత్రికులు, వ్యాపారవేత్తలు కమర్షియల్ విమానాల ద్వారా వెంటనే స్వదేశానికి చేరుకోవాలని సూచించింది. పౌరులంతా అత్యంత అప్రమత్తంగా ఉండాలని, అల్లర్లు జరిగే ప్రాంతాలకు దూరంగా ఉంటూ ఎంబసీతో నిరంతరం సంప్రదింపులు జరపాలని అధికారులు ఆదేశించారు.

అణు చర్చల విఫలం.. యుద్ధానికి సై అంటున్న ట్రంప్
ఇరాన్, అమెరికా మధ్య జరుగుతున్న అణు చర్చలు ఒక కొలిక్కి రాకపోవడంతో ఉద్రిక్తతలు పతాకస్థాయికి చేరుకున్నాయి. చర్చలు విఫలమైతే ఇరాన్‌పై సైనిక చర్యకు వెనుకాడబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. దీనికి అనుగుణంగానే అమెరికా తన విమాన వాహక నౌకలు, జలాంతర్గాములు, ఫైటర్ జెట్లను పశ్చిమాసియా ప్రాంతంలో భారీగా మోహరించింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో మరోసారి అల్లర్లు చెలరేగాయి. అగ్రరాజ్యం ఒత్తిడిని వ్యతిరేకిస్తూ పలు యూనివర్సిటీలకు చెందిన విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. ఇప్పటికే ఇక్కడ జరిగిన తొలి దశ అల్లర్లలో సుమారు 7,105 మంది ప్రాణాలు కోల్పోయారని అమెరికా మానవ హక్కుల సంఘం వెల్లడించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

Read More తక్షణమే ఇరాన్‌ను వీడండి

పౌరులకు ఎంబసీ కీలక సూచనలు
ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఇరాన్‌లో ఉన్న భారతీయులు తమ పాస్‌పోర్ట్‌లు, ఐడీ కార్డులు, ఇమిగ్రేషన్ పత్రాలను ఎల్లప్పుడూ వెంట ఉంచుకోవాలని ఎంబసీ స్పష్టం చేసింది. ఒకవేళ ఇప్పటివరకు రాయబార కార్యాలయం వద్ద పేర్లు నమోదు చేసుకోని వారు ఉంటే, తక్షణమే రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని కోరింది. స్థానిక మీడియా వార్తలను గమనిస్తూ, అత్యవసర సమయాల్లో రాయబార కార్యాలయం అందించే సహాయాన్ని కోరాలని సూచించింది. దేశం విడిచి వచ్చేందుకు ప్రయాణ మార్గాలను వెతుక్కోవాలని, వీలైనంత త్వరగా సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. భద్రతా ఏజెన్సీలు ఇరాన్‌లోని పరిణామాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ పౌరులకు అవసరమైన మార్గదర్శకాలను అందిస్తున్నాయి.

Tags: