అవినీతిని ప్రశ్నిస్తున్నందుకే టార్గెట్‌ చేస్తున్నారు: విజయ్‌

అవినీతిని ప్రశ్నిస్తున్నందుకే టార్గెట్‌ చేస్తున్నారు: విజయ్‌

విశ్వంభర, నేషనల్ బ్యూరో: ప్రభుత్వాల అవినీతిని, అక్రమాలను ప్రశ్నిస్తూ.. వాటికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నందుకే అందరూ తనను లక్ష్యంగా చేసుకుంటున్నారని టీవీకే చీఫ్ విజయ్‌ ఆరోపించారు. తమ పార్టీ నిర్వహించే బహిరంగ సభలకు కూడా డీఎంకే ప్రభుత్వం అనుమతి ఇవ్వట్లేదన్నారు. అందువల్లే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలను కలవలేకపోతున్నానని వెల్లడించారు. టీవీకే ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అనంతరం ప్రతి గ్రామాన్ని సందర్శిస్తానని హామీ ఇచ్చారు. ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా.. వెనక్కి తగ్గనని  అవినీతిని ప్రశ్నిస్తూనే ఉంటానని అన్నారు. వేలూర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో విజయ్‌ మాట్లాడుతూ..ఈ వ్యాఖ్యలు చేశారు.రాష్ట్రంలో అవినీతి, నేరాలను అరికట్టడంలో స్టాలిన్‌  ప్రభుత్వం విఫలమయ్యిందని విజయ్‌ ఆరోపించారు. త్వరలో జరగనున్నవి ఎన్నికలు కాదని తమిళనాడు ప్రజలకు, అవినీతి ప్రభుత్వానికి మధ్య యుద్ధమని అన్నారు. ఈ యుద్ధంలో ప్రజలే విజయం సాధిస్తారన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో తనను ఎలాగైనా ఓడించాలనే ఆలోచనతో స్టాలిన్‌ కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేకు ఓటు వేస్తే భాజపాకు వేసినట్లేనని అన్నారు. ఎన్నికల్లో ఓటమి భయంతో స్టాలిన్‌ ప్రభుత్వం బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని చూస్తుందని ఆరోపించారు. పరిస్థితులకు అనుగుణంగా మారిపోవడం ఆ పార్టీ నేతలకు అలవాటేనని దుయ్యబట్టారు.

Tags: