హెచ్ సిఏ సెక్రటరీగా పోటీ చేస్తున్న జీవన్ రెడ్డిని గెలిపించాలి
విశ్వంభర, బషీర్ బాగ్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ ) ఎన్నికలు ఈనెల 15న జరగనున్నట్లు అంబర్పేట్ క్రికెట్ క్లబ్ అధ్యక్షులు, మాజీ రాజ్య సభ సభ్యుడు వి. హనుమంతరావు వెల్లడించారు. సోమవారం ఫతే మైదాన్ క్లబ్ లో మీడియా సమావేశం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రికెట్ హబ్బును హైదరాబాదులోనే కాకుండా జిల్లాలో కూడా విస్తరించాలని తన సంకల్పాన్ని వెల్లడించినట్టు ఆయన తెలిపారు. క్రికెట్ అభివృద్ధి కొరకై హెచ్సీఏ సెక్రటరీగా పోటీ చేస్తున్న జీవన్ రెడ్డిని గెలిపించాలని ఆయన కోరారు. తనను గెలిపిస్తే తెలంగాణ జిల్లాల్లో కూడా స్పోర్ట్స్ మైదానాలను ఏర్పాటు చేసి అభివృద్ధి చేస్తారని తెలిపారు. అభివృద్ధిపై ఆలోచన చేసే వ్యక్తిని ఎన్నుకుంటే రూరల్లో ఉన్న యువతకు చేయూతనిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు గోకరాజు రంగరాజు ఎన్నో అభివృద్ధి పనులు చేశారని గుర్తు చేశారు. అలాగే తెలంగాణలోని ప్రతి జిల్లాలో క్రికెట్ గ్రౌండ్ ను ఏర్పాటు చేస్తానని జీవన్ రెడ్డి హామీ ఇచ్చారని పేర్కొన్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో రాష్ట్ర వ్యాప్తంగా 215 మంది సభ్యులు ఉండగా 175 మందికి ఓటింగ్ హక్కు ఉన్నదని వివరించారు. జిల్లాల్లో క్రికెట్ మైదానాలు ఏర్పాటు కావాలంటే జీవన్ రెడ్డి గెలిస్తేనే సాధ్యం అవుతుందని వి. హనుమంత రావు అన్నారు. అభివృద్దికి ఆలోచించి ఓటు వెయ్యాలని సభ్యులను విహెచ్ కోరారు. కార్యక్రమంలో క్రికెట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సెక్రటరీ శేషనారాయణ, అవినాష్ తదితరులు పాల్గొన్నారు.



